5 రూపాయలకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్

23 Oct, 2016 07:58 IST|Sakshi
5 రూపాయలకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్

బళ్లారి: చవక డేటా ప్యాకేజీల విషయంలో టెలికాం కంపెనీలు ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తరుణంలో అలాంటి ప్యాకేజీనే ప్రకటించి అదిరిపోయే లాభాలు ఆర్జిస్తున్నాడో యువకుడు. కేవలం ఐదు రూపాయలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోన్న అతను ఓ సాధారణ చాయ్వాలా! డేటాగిరీని కొత్త పుంతలు తొక్కిస్తోన్న ఈ యువకుఇ కథనంలోకి వెళితే..

కర్ణాటకలోని సిరుగుప్ప(బళ్లారి జిల్లాలోని గ్రామం) కు చెందిన 23 ఏళ్ల సయీద్ ఖాదర్ బాషా.. స్థానికంగా చిన్న టీస్టాల్ నడుపుకొంటున్నాడు. పదోతరగతి తర్వాత ఆర్థిక కారణాల వల్ల చదువుకు స్వస్తి చెప్పిన అతను.. చాయ్ వాలాగా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అందరిచేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తుండటం, స్నేహితులు ఇంటర్నెట్ వినియోగంపై చర్చించడం గమనించిన బాషా.. మెల్లగా నెట్ వ్యవహారాలపై పట్టుపెంచుకున్నాడు. స్థానిక కేబుల్ ఆపరేటర్ ద్వారా తన టీస్టాల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు.

టీస్టాల్ లో వైఫై రూటర్ ఏర్పాటుచేసి చాయ్ తాగే కస్టమర్లందరికీ 30 నిమిషాలపాటు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తున్నాడు. అయిదు రూపాయల టీ కొనుక్కున్న ప్రతిఒక్కరికీ వైఫై పాస్ వర్డ్ ఉంచిన కూపన్ ను ఇస్తాడు. అలా చాయ్ తాగుతూ డేటా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించాడు. ఒకప్పుడు రోజుకు 100 టీలు అమ్మిన బాషా.. సెప్టెంబర్ లో 'ఫ్రీ ఇంటర్నెట్' ఐడియా అమలుచేస్తున్నప్పటి నుంచి 500 టీలు అమ్మేస్తున్నాడు. గతంలో ఉదయ్ పూర్, వడోదరాకు చెందిన ఇద్దరు చాయ్ వాలాలు కూడా ఇలాంటి ప్యాకేజీతోనే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

'నా టీస్టాల్ లో నెట్ స్పీడ్ 2ఎంబీపీఎస్. ఒకేసారి 10-15 మంది డేటా వాడుకుంటారు. సిరుగుప్ప లాంటి చిన్న పల్లెటూళ్లో ఇలాంటి సేవలు అద్భుతమని ఇక్కడికొచ్చే కస్టమర్లు కితాబిస్తారు. టీ అమ్మకాలు పెరగడం సంతోషంగా ఉన్నా, చదువుకునే విద్యార్థులకు ఎంతో కొంత సాయపడుతున్నానన్న సంతృప్తే నాకు ఆనందాన్నిస్తుంది' అని బాషా చెబుతున్నాడు. డేటా గిరీని కొనసాగించేలా బాషాను అభినందిద్దామా..

మరిన్ని వార్తలు