అర్హులకే అవకాశమివ్వాలి

7 Sep, 2015 01:18 IST|Sakshi

వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీపై నిపుణుల వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వులు అశాస్త్రీయంగా ఉన్నాయని, అలాంటి వారితో రైతాంగానికి ఎలాంటి మేలు జరగదని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రైతాంగానికి అనుబంధంగా ఉన్న పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం నియమించే ఉద్యోగుల అర్హతలను సడలించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని వారు చెబుతున్నారు.

పశువులు, ఇతర జంతువుల సంరక్షణ, వాటికి రోగాలు సోకితే చికిత్స చేయడానికి మండల స్థాయిలో పశు సంవర్థక వైద్యుడిని నియమిస్తారు. రాష్ట్రంలో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఉత్తర్వులను సవరించాలని నిపుణులు కోరుతున్నారు.

ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్(వీఏ) ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్‌లో మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్(ఎంపీవీఏ) కోర్సు, వెటర్నరీ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసిన వారితో పాటు ఇంటర్మీడియెట్ ఒకేషనల్, పౌల్ట్రీ, డైరీ కోర్సు పాసైన వారు కూడా అర్హులే. పశువుల ఆసుపత్రులలో ప్రతి నిత్యం గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు, ఎద్దులు, కుక్కలు, కోళ్లకు, రోగ నివారణ చర్యలతో పాటు, రోగ నిర్ధారణ చికిత్సలు జరుగుతుంటాయి. కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఇందులో భాగమే. వీటితో డైరీ కోర్సు చదివిన వారికి సంబంధమే లేదు.

ఆరోగ్యంగా ఉన్న పశువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, వాటి నిల్వ జాగ్రత్తలకు సంబంధించినదే డైరీ కోర్సు. కేవలం కోళ్లకు సంబంధించినదే పౌల్ట్రీ కోర్సు. పశువుల ఆసుపత్రికి వచ్చే అనేక రకాలైన వాటిలో కోళ్లు ఒక భాగం మాత్రమే. ఈ రెండు కోర్సులు చేసిన వారిని కూడా వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేయడం వల్ల వీరికి గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు, కుక్కలు తదితర జంతువులు వాటి వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఎలాంటి పరిజ్ఞానం ఉండదు.

వీరిని ఎంపిక చేసిన అనంతరం ప్రభుత్వం ఇచ్చే ఒక సంవత్సరం శిక్షణ కూడా ఆస్పత్రుల నిర్వహణకే తప్ప సబ్జెక్టుకు సంబంధించింది కాదు. ఇంతెందుకు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ ఉద్యోగాలకు బీవీఎస్‌సీ పాసైన వారు మాత్రమే అర్హులు తప్ప బీఎస్‌సీ డైరీ టెక్నాలజీ పాసైన వారిని ఎట్టి పరిస్థితిలో తీసుకోరని నిపుణులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంటు ఉద్యోగాల అర్హతలో వివక్ష ఉండకూడదన్నది వారి అభిప్రాయం.

సరైన విషయ పరిజ్ఞానం లేని వారితో పశు సంవర్ధక శాఖలో క్షేత్రస్థాయిలో కీలకమైన వెటర్నరీ అసిస్టెంటు ఉద్యోగాలకు డైరీ, పౌల్ట్రీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఉద్యోగాల విధులకు న్యాయం జరుగదు. రైతులకు ప్రయోజనం కలుగదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  క్షేత్ర స్థాయి సిబ్బంది ఎంపికలో అశాస్త్రీయ విధానాలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు