త్యాగాలు ఎవరి కోసం..?

30 Nov, 2015 01:36 IST|Sakshi
త్యాగాలు ఎవరి కోసం..?

తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు: ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారమవుతాయనుకున్నారు. పాలకులు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేస్తారని ఆశించి అనేక వర్గాల ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రస్తుత తెలంగాణ పాలకులు గత  టీడీపీ, కాంగ్రెస్ అవలంబించిన అభివృద్ధి నమూనానే అమలు చేయాలనుకుంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నట్టు? ఎందుకు ఆత్మత్యాగాలు చేసినట్లు?’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ నిలదీశారు.

ప్రత్యేక అవసరాలు గల చెవిటి, మూగ, మానసిక వైకల్యం, దృష్టిలోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం విద్యా హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన హరగోపాల్ మాట్లాడుతూ అహంకారంతో కాకుండా బాధలను పంచుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలను పాలకులు నిరాశకు గురి చేశారన్నారు. చెవిటి, మూగవారికి సైగలతో కూడిన విద్య కోసం ప్రత్యేక బడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
 
వికలాంగులకు ప్రాధాన్యమివ్వాలి...

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులు మానసికంగా కుంగిపోకుండా సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. వికలాంగులకు, అనాథలకు విద్య, ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ శారీరక వైకల్యానికి ప్రభుత్వాలదే బాధ్యత అని అన్నారు. న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది వైకల్యమున్న పిల్లలకు ఏడు స్కూళ్లు మాత్రమే ఉన్నాయంటే వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు.

2015-16 బడ్జెట్‌లో వికలాంగులకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నవనిర్మాణ వేదిక గౌరవాధ్యక్షులు మురళీధర్‌గుప్తా, అధ్యక్షులు నల్లగంటి రామకృష్ణ, ప్రధానకార్యదర్శి సిలివేరి వెంకటేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.

మరిన్ని వార్తలు