హైదరాబాద్‌కు యాసిన్, తబ్రేజ్!

30 Aug, 2013 04:10 IST|Sakshi
హైదరాబాద్‌కు యాసిన్, తబ్రేజ్!

సాక్షి, హైదరాబాద్: యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ల అరెస్టు దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు దర్యాప్తును ఒక కొలిక్కి తేగలదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 17 మంది ప్రాణాలు తీయడంతో పాటు 119 మంది గాయాలకు కారణమైన జంట పేలుళ్లపై మలక్‌పేట (146/2013), సరూర్‌నగర్ (56/2003) పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసు లు రెండు వారాలపాటు దర్యాప్తు చేశారు. తర్వాత కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించారు.

 

ఎన్‌ఐఏ మార్చి 14న కేసు నమోదు చేసింది. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్ వద్ద పేలుడుకు సంబంధించి ఆర్‌సీ-01/2013/ఎన్‌ఐఏ/హైదరాబాద్‌గా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద పేలుడుకు సంబంధించి ఆర్‌సీ 02/2013/ఎన్‌ఐఏ/హైదరాబాద్‌గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టం ప్రకారం ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాసిన్, తబ్రేజ్‌లు స్వయంగా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో నిర్ధారణైంది. రెగ్జిన్ బ్యాగ్‌ను వీపునకు తగిలించుకుని 107 బస్టాప్‌లో సైకిల్‌కు యాసిన్‌భత్కల్ బాంబు పెట్టినట్లు సీసీ కెమెరాల వీడియో దృశ్యాల ద్వారా గుర్తించారు.
 
 యాసిన్‌కు సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ కూడా ఉన్నట్లు బయటపడింది. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ సైకిల్ బాంబును అమర్చినట్లు తేలింది. బాంబును అమర్చిన సైకిల్‌ను తబ్రేజ్ తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు రోడ్డు మీద ట్రాఫిక్ పరిశీలన కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమేరా ద్వారా గుర్తించారు. అరెస్టయిన యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను జంట పేలుళ్ల కేసులో విచారించేందుకు ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. యాసిన్ అరెస్టుతో రాష్ర్టవ్యాప్తంగా అన్ని నగరాలు, పుణ్యక్షేత్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిందిగా డీజీపీ దినేష్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలకూ ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని వార్తలు