ఒక ముస్లిం.. ఒక క్రికెటర్‌.. యోగి కేబినెట్‌ ఇదే!

19 Mar, 2017 14:20 IST|Sakshi
ఒక ముస్లిం.. ఒక క్రికెటర్‌.. యోగి కేబినెట్‌ ఇదే!

లక్నో: హిందుత్వ ఐకాన్‌గా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ (44) ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉప్‌వన్‌లో మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయనతో గవర్నర్‌ రాంనాయక్‌ ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే యూపీ మాజీ సీఎంలు అఖిలేశ్‌ యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు పలువురు ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సీఎం రేసులో ముందు వరసలో కనిపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బీజేపీ సీనియర్‌ నేత, లక్నో మేయర్‌ దినేశ్‌ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

యోగి కేబినెఎట్‌లో 46మంది
ముఖ్యమంత్రి యోగితో కలిపి మొత్తం 46మందితో ఉత్తరప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇందులో 22 మంది కేబినెట్‌ మంత్రులు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు. ఈ మెగా ప్రమాణ స్వీకార వేడుకలో సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో ముస్లిం వర్గానికి చెందిన మోహ్సిన్ రాజాకు అవకాశం ఇచ్చారు. అలాగే మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌కు కూడా మంత్రిగా చాన్స్‌ లభించింది. అట్టహాసంగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు లక్షమందికిపైగా ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకకు 35వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

యూపీ సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, మనోజ్‌ సిన్హాలతోపాటు పలువురి పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చినప్పటికీ.. గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగివైపే పార్టీ అధినాయకత్వం మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. శనివారం లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో యోగి పేరును ఖరారు చేసింది.