వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది

11 Oct, 2015 04:02 IST|Sakshi
వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంది

♦ బరువు తగ్గి నీరసించిన జగన్
♦ మూడోరోజూ వైద్య పరీక్షలు
 
 గుంటూరు మెడికల్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. శనివారం బరువు తగ్గడంతోపాటు బాగా నీరసించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి వైద్యులు గురువారం నుంచిప్రతి రోజూ ఉదయం, రాత్రి వేళల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. శనివారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మొత్తం మూడుసార్లు వైద్య పరీక్షలు చేశారు. శనివారం ఉదయం 7.30గంటలకు జీజీహెచ్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రీస్తుదాసు, మధ్యాహ్నం 1.30గంటలకు, రాత్రి 8.30గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శనక్కాయల ఉదయ్‌శంకర్ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఉదయం రక్తపోటు (బీపీ) 120/90, షుగర్ 87, పల్స్ 66 ఉండగా... మధ్యాహ్నం సమయానికి బీపీ 110/80,  షుగర్ 82, పల్స్ 70 ఉంది. రాత్రి సమయానికి బీపీ 100/60, షుగర్ 76, పల్స్ 80 ఉన్నట్లు జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ అనంత  శ్రీనివాసులు వెల్లడించారు. బీపీ సాధారణ స్థాయి 100/ 70 నుంచి 140/ 90 వరకు, షుగర్ లెవల్స్ సాధారణ స్థాయి 110లోపు, పల్స్ సాధారణ స్థాయి 60 నుంచి 100 వరకు ఉండవచ్చు. వైఎస్సార్‌సీపీ తరఫున డాక్టర్ గజ్జెల నాగభూషణంరెడ్డి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగాయి. వైఎస్ జగన్ తొలిరోజు 75  కిలోల  బరువు ఉండగా శనివారం రాత్రి 73.8 కిలోలకు తగ్గారు. జగన్ శనివారం బలహీనంగా కనిపించారు.

మరిన్ని వార్తలు