విభజనను అడ్డుకోవడం నా శక్తికి మించింది: పల్లం రాజు

25 Nov, 2013 15:08 IST|Sakshi
విభజనను అడ్డుకోవడం నా శక్తికి మించింది: పల్లం రాజు
ప్రధాని మన్మోహన్ సింగ్ ఒత్తిడి మేరకే తాను మంత్రివర్గంలో కొనసాగుతున్నాను అని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పల్లం రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్ననిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పల్లం రాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు వేర్వేరు సంఘటనల్లో రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రధాని తనను కోరారన్నారు. 'మానవ వనరుల శాఖ కీలకమైంది. ఆ శాఖ పనితీరు ఆగిపోతే ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది' అని ప్రధాని తనతో అన్నారని పల్లం రాజు తెలిపారు. 
 
దాంతో తాను మంత్రివర్గంలో కొనసాగాలని నిశ్చయించుకున్నాను. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అనుకున్నాను అని పల్లం రాజు వ్యాఖ్యానించారు. అంతేకాక తెలంగాణ ఏర్పడటం ఖాయమని.. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమయ్యాం అని అన్నారు. విభజనను అడ్డుకోవడం తన శక్తికి మించింది అని అన్నారు.
 
అన్నిప్రాంతాలకు న్యాయం చేయడానికి కేంద్ర మంత్రుల బృందం కసరత్తు చేస్తోంది అని అన్నారు.  రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్ (రుసా) సమావేశంలో ఉన్నత విద్యాశాఖ మంత్రుల భేటిలో పల్లం రాజు పాల్గోన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా విషయంపై వివరణ ఇచ్చారు.
మరిన్ని వార్తలు