విశాఖలోనే ఉదయ్‌ రైలు..

10 Aug, 2019 09:57 IST|Sakshi

వాల్తేర్‌కు మరో డబుల్‌ డెక్కర్‌ రైలు

భువనేశ్వర్‌కు తరలించే ఎత్తుగడలు విఫలం

ఉదయ్‌ రైలు విశాఖ–విజయవాడల మధ్య నడిపేందుకు పచ్చజెండా    

విశాఖకు మంజూరైన మరో రైలును భువనేశ్వర్‌కు తన్నుకుపోయేందుకు జరిగిన యత్నాలు విఫలమయ్యాయి. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు చాన్నాళ్ల క్రితమే విశాఖకు మంజూరైనా దాన్ని తీసుకురావడంలో నాన్చుడు ధోరణి అవలంభించిన తూర్పుకోస్తా రైల్వే ఉన్నతాధికారులు.. ఎట్టకేలకు విశాఖకు వచ్చిన రైలును కూడా తమ జోన్‌ ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌కు తరలించేందుకు చేసిన యత్నాలకు రైల్వే శాఖ బ్రేక్‌ వేసింది. ఆ రైలు విశాఖకే కేటాయించినట్లు విస్పష్టంగా ప్రకటించిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌.. దాన్ని విశాఖ, విజయవాడల మధ్య నడపనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల విశాఖ నుంచి రాష్ట్ర రాజధానికి మరో రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇప్పుడున్న రైళ్లన్నీ నిత్యం కిటకిటలాడుతుంటాయి. డబుల్‌ డెక్కర్‌ పట్టాలపైకెక్కితే రద్దీని కొంతవరకు తట్టుకునే అవకాశం ఏర్పడుతుంది.

సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు ఉదయ్‌ రైలు విశాఖలోనే పట్టాలెక్కనుంది. దీన్ని భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పెద్దలు ప్రయత్నాలు చేసినా..  వాల్తేరు నుంచే సేవలందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు. విశాఖ నుంచి విజయవాడకు దీన్ని నడిపేందుకు రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆగస్టు 15 తర్వాత ఈ రైలు పట్టాలెక్కనుంది.

ఎన్నో అవరోధాలు
నిత్యం రద్దీగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య కొత్త రైలుకు రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా అనేక అవరోధాలు ఎదురయ్యాయి. ఉదయ్‌ పేరుతో కేటాయించిన డబుల్‌ డెక్కర్‌ రైలు(ట్రైన్‌ నం. 22701/22702)ను విశాఖకు తీసుకురావడంలోనూ అనేక ఇబ్బందులు సృష్టించారు. గత నెల 17న విశాఖకు చేరుకున్నప్పటికీ ఇంత వరకూ ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించలేదు. ఈ రైలును విశాఖ నుంచి విజయవాడకు నడపాలని నిర్దేశించినప్పటికీ దాన్ని వాల్తేరు డివిజన్‌ నుంచి భువనేశ్వర్‌కు తరలించేందుకు ఈస్ట్‌కోస్ట్‌ అధికారులు ప్రయత్నాలు చేశారు. వాల్తేర్‌లో సరైన నిర్వహణ సిబ్బంది లేరనే సాకు చూపిస్తూ రైలును తరలించేందుకు కుయుక్తులు పన్నారు. కానీ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంతో పోరాడటంతో విశాఖ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయ్‌ను నడిపేందుకు అవసరమైన సిబ్బందిని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే కేటాయించింది.

వారంలో 5 రోజులు సర్వీసు
విశాఖ మీదుగా వెళ్తున్న రైళ్లతో పాటు ఇక్కడి నుంచి బయలుదేరేవి కలిపి మొత్తం 107 రైళ్లు విజయవాడ వెళ్లేందుకు అందుబాటులో ఉన్నాయి. అయినా రద్దీ తగ్గకపోవడంతో మరో రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖకు మంజూరైన ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలును విశాఖ–విజయవాడ మధ్య నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తిరుపతి కి ఓ డబుల్‌ డెక్కర్‌ రైలు నడుస్తోంది. ఉదయ్‌ కూడా ప్రారంభమైతే విశాఖ నుంచి రెండు డబుల్‌ డెక్కర్లు చక్కర్లు కొట్టనున్నాయి. ప్రస్తుతానికి ఉదయ్‌ వారానికి 5 రోజుల పాటు నడుస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలో విశాఖ నుంచి విజయవాడకు థర్డ్‌ ఏసీకి రూ.645 చార్జీ వసూలు చేస్తున్నారు. డబుల్‌ డెక్కర్‌లో అన్ని బోగీల్లో చైర్‌కార్‌ సీట్లే ఉంటాయి కాబట్టి చార్జీ రూ.525 మాత్రమే ఉంటుంది. 

ట్రయల్‌ రన్‌ లేకుండానే....
ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతికి డబుల్‌ డెక్కర్‌ నడుస్తున్నందున ఉదయ్‌కు ట్రయల్‌ రన్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వాల్తేర్‌ డివిజన్‌ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. ఈ రైలులో 18 డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, 4 పవర్‌ కార్లు ఉన్నాయి. వీటిలో 9 కోచ్‌లను, 2 పవర్‌ కార్లను చెన్నై పంపించారు. వీటిని విశాఖ–విజయవాడ మార్గంలోనే పంపించడంతో.. దాన్నే ట్రయల్‌ రన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని తరలించే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకపోవడంతో మళ్లీ ప్రత్యేకంగా ట్రయల్‌ రన్‌ లేకుండా.. ఆగస్టు 15 తర్వాత గానీ, ఈ నెల చివరి వారంలో గానీ ఉదయ్‌ పట్టాలపైకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఆదరణ బాగుంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు