అంగుళం నీటితో పదకొండెకరాల సాగు!

27 Sep, 2017 14:58 IST|Sakshi

కరువును జయించిన యర్రగొండపాలెం రైతు

టైలరింగ్‌ వృత్తి మానుకొని ప్రకృతి వ్యవసాయంలోకి...

11 ఎకరాల సొంత భూమిలో దానిమ్మ, యాపిల్‌ బెర్, కొర్ర, కంది సాగు

అంగుళం బోరు నీటితోనే 11 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న కాశయ్య

పదకొండెకరాల మెట్ట భూమికి యజమాని ప్రకాశం జిల్లా యర్రగొండపాలానికి చెందిన మల్లెల కాశయ్య. గతంలో రసాయనిక వ్యవసాయం చేసి భారీగా నష్టపడి వ్యవసాయం మానేశాడు. నెలకు రూ. 15 వేల వరకు ఆదాయాన్నిచ్చే టైలరింగ్‌ వృత్తిని నమ్ముకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో నాలుగేళ్ల క్రితం శ్యాంసుందర్‌రెడ్డి(గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ) ప్రకృతి వ్యవసాయంపై కథనం కాశయ్యను ఆలోచింపజేసింది. పుస్తకాలు చదివి కొంత అవగాహన పెంచుకున్నాడు.

ఆ దశలో కాకినాడలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ 8 రోజుల శిక్షణా శిబిరంలో పాల్గొని అవగాహనను పరిపుష్టం చేసుకున్నాడు. రెండు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం ప్రారంభించి, యర్రగొండపాలెం మండలం సర్వేయపాలెంకు సమీపంలోని తన పొలంలో కరువు కాలంలోనూ నిశ్చింతగా పంటలు సాగు చేస్తున్నాడు. బోర్లే సాగు నీటికి ఆధారం. 650 నుంచి వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే తప్ప నీటి జాడ లేదు. వర్షాభావం వేధిస్తున్న తరుణంలో తన బోరులో అంగుళం నీరే వస్తున్నప్పటికీ డ్రిప్‌ ద్వారా పంటలు పండిస్తున్నాడు.

మండుటెండల్లోనూ బెట్టకురాని మొక్కలు
2016 జనవరిలో 3 ఎకరాల్లో భగువ రకం దానిమ్మ మొక్కలను నాటాడు. ఆకులు, కొమ్మలతో మల్చింగ్‌ చేశాడు. మధ్యలో దోస పాదులు పెట్టడంతో భూమిలో తేమ ఆవిరికాకుండా కాపాడాయి. దానిమ్మ చెట్లకు రక్షణగా ఉన్నాయి. భూమి సత్తువ పెంచేందుకు పెసర, ఉలవ పంటలను అంతర పంటలుగా వేశారు. మొదటి నుంచే జీవామృతం, ఘనజీవామృతం  మొక్కలకు అందిస్తూ వచ్చాడు.

కేవలం ఒక బోరు నుంచి వస్తున్న అంగుళం నీటితోనే డ్రిప్‌ ద్వారా తడులు ఇస్తున్నాడు. గత ఏప్రిల్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ చెట్లు ఎటువంటి బెట్టకు గురికాలేదు. ప్రస్తుతం 18 నెలల దానిమ్మ చెట్లు తొలిసారి కాపునకు వచ్చాయి. రసాయనిక ఎరువులు వాడినట్లయితే దానిమ్మ చెట్లు చేతికందకుండా పోయేవని కాశయ్య అంటున్నారు. 3 ఎకరాల్లో యాపిల్‌ బెర్‌ మొక్కలను నాటారు. అంతర పంటగా కంది విత్తారు.

మిగతా 4 ఎకరాల్లో కొర్ర, కంది, జొన్న పంటలు వేశారు. మధ్యలో దోస విత్తనాలు చల్లారు. అంతర పంటలు ప్రధాన పంటలకు సజీవ ఆచ్ఛాదనగా నిలవడంతోపాటు.. ఖర్చులకు సరిపోను ఆదాయం వస్తున్నదని కాశయ్య తెలిపారు. తాను పండించిన పెసలకు క్వింటాకు రూ. వెయ్యి అదనంగా ధర పలికిందన్నారు.    కుటుంబానికి, ప్రజలకు  ఆరోగ్యకరమైన ఆహారం అందించగలుగుతున్నానన్నారు.
– నూరుద్దీన్‌.ఎస్‌., యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా

పనులన్నీ మేమే చేసుకుంటాం..పెట్టుబడి టెన్షన్‌ లేదు.. తృప్తిగా ఉంది!
రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పత్తి, వరి తదితర పంటలు పండించి చేతులు కాల్చుకొని పొలాన్ని కౌలుకు ఇచ్చేసి టైలర్‌ పని చేసుకుంటున్నా. నాలుగేళ్ల క్రితం డా. శ్యాంసుందర్‌రెడ్డి కథనం నన్ను ఆలోచింపజేసింది. ఆయన తోటను చూసి స్ఫూర్తి పొందాను. పాలేకర్‌ శిక్షణతో పూర్తి అవగాహన వచ్చింది.

దానిమ్మ, యాపిల్‌ బెర్, కొర్ర, కంది, జొన్న సాగు చేస్తున్నా. మా కుటుంబ సభ్యులు ఐదుగురమూ రోజూ పొలం పనులు చేసుకుంటాం. ఇతర పనులతోపాటు జీవామృతం, కషాయాలను స్వయంగా చేసుకుంటాం. తృప్తిగా ఉంది. పెట్టుబడుల టెన్షన్‌ లేదు.
– మల్లెల కాశయ్య (94417 86094), యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా

మరిన్ని వార్తలు