పురుగుల మందు పిచికారీపై జాగ్రత్త సుమా..

5 Sep, 2014 00:00 IST|Sakshi

 నవాబుపేట: పంట పొలాలు, తోటల్లో పురుగుల మందు పిచికారీ రైతుల పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. ఖరీప్ సీజన్‌లోనే ఎక్కువగా పురుగుల మందు పిచికారీ ప్రభావంతో రైతులు ఆస్పత్రుల పాలవుతున్నారు.

పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. యేటా చాలా మంది రైతులు విష ప్రభావానికి గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇటీవల పులుమామిడి, కొజ్జవనంపల్లి, మాదారం గ్రామాల్లో పలువురు రైతులు పురుగు మందు పిచికారీ అనంతరం విష ప్రభావానికి గురై వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. అందుకని మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది.

 విష ప్రభావం ఇలా..
 మందుల పిచికారీ చేసేటప్పుడు చర్మం, నోరు, శ్వాసకోశం, కనుగుడ్ల ద్వారా విషం శరీరంలోకి ప్రవేశించి ప్రమాదం వాటిల్లవచ్చు. విష ప్రభావానికి గురైన వ్యక్తులు తలనొప్పి, అలసట, బలహీనత, తలతిరగడం, చర్మం, కండ్లు మంట కల్గించడం, కనుచూపు మందగించడం, కనుగుడ్డు చిన్నగవడం, స్పృహ తప్పడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

పిచికారీ సమయంలో శరీరంపై మందుపడకుండా నిండా దుస్తులు ధరించకపోవడం, నోటికి అడ్డంగా గుడ్డ కట్టుకోకపోవడం వల్ల, అధిక వేడిలో పిచికారీ చేయడంతో శరీరంపై తెరుచుకున్న స్వేద రంధ్రాల వల్ల విషం శరీరంలోకి చేరుతుంది. శరీరంపై గాయాలుంటే అక్కడ పడిన విషం నేరుగా శరీరంలోకి చేరుతుంది. తద్వారారైతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రాణాలు సైతం పోయే ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. మందుల పిచికారీపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. 

మరిన్ని వార్తలు