శ్రీ పద్ధతిలో రాగి సాగు!

26 Jul, 2016 00:10 IST|Sakshi
శ్రీ పద్ధతిలో రాగి సాగు!

తక్కువ నీటితోనే వరిలో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు విస్తృతంగా అనుసరిస్తున్న పద్ధతి శ్రీ (ఎస్.ఆర్.ఐ - సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్). రాగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండి అధిక ధర పలుకుతున్నప్పటికీ.. పాత పద్ధతుల్లో సాగు చేసే రైతులు లాభపడలేకపోతున్నారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన రైతులు శ్రీ వరి సాగు పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే రాగిని ఏకపంటగా సాగు చేస్తూ.. ఎకరాకు 12-15 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..

 అనాదిగా మన రైతులు సాగు చేస్తున్న ఒకానొక చిరుధాన్యపు పంట రాగులు లేదా తైదలు. అయితే, దిగుబడి ఎకరాకు 4-6 క్వింటాళ్లకు పరిమితమవ్వటంతో రైతులు అధికాదాయం కోసం వాణిజ్య పంటల సాగుకు మళ్లుతున్నారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన రైతులు శ్రీవరి మాదిరిగానే రాగిని సేంద్రియ పంటగా పండిస్తూ మూడు రెట్ల దిగుబడి సాధిస్తున్నారు. శ్రీ పద్ధతిలో రాగి పంట సాగుకు స్థానిక వంగడాలను ఎంచుకుంటే చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటాయి. విత్తన ఎంపికలో నేలను, పంట కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.   

 నారు మడి తయారీ.. విత్తన ఎంపిక
 4 మీటర్ల పొడవు, 1 మీ. వెడల్పుతో ఎకరాకు నాలుగు బెడ్‌లు (మట్టిపరుపులు) ఏర్పాటు చేసుకోవాలి. బాగా కుళ్లిన 5 క్వింటాళ్ల పశువుల ఎరువును బెడ్‌లపై వేయాలి.

 ఎకరాకు 300-400 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాలను నీటి లో పోసి.. పైకి తేలిన తాలు విత్తనాలను తొలగించాలి. లీటరు నీటిలో 35 ఎం.ఎల్. పంచగవ్యను కలిపి.. విత్తనాలను 8 గంటలు నానబెట్టి లేదా బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. తేమ ఆరిన తర్వాత విత్తనాలను ఇసుక లేదా వర్మీ కంపోస్టుతో కలిపి సమానంగా విత్తుకోవాలి. విత్తాక బెడ్‌పై వర్మీ కంపోస్టు లేదా చివికిన పశువుల ఎరువును వేయాలి. విత్తిన మూడు రోజుల్లోపు లీటరు జీవామృతాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి బెడ్‌పై పిచికారీ చేయాలి. ఉష్ణోగ్రత 35 డిగ్రీలకన్నా ఎక్కువ ఉంటే షేడ్‌నెట్‌ను వాడాలి. 15-20 రోజుల నారును మాత్రమే నాటుకోవాలి.

 పొలం తయారీ ఇలా..
 బాగా దుక్కి దున్ని ఎకరాకు రెండు టన్నుల చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. జనుము లేదా జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లను జూలైలో సాగు చేసుకుని బాగా కలియదున్నితే భూమి సారవంతమవుతుంది. వాలుకు అడ్డంగా సాళ్లను ఏర్పాటు చేసుకుంటే నేల కోతను అరికట్టవచ్చు.  

 పొలంలో నాటుకోవటం..
 15-25 రోజుల వయసున్న నారును వేర్లు తెగకుండా పీకి బోదె మధ్యలో నాటుకోవాలి. సాళ్లు, మొక్కల మధ్య దూరం 10 అంగుళాల దూరం ఉండాలి. రెండు సాళ్ల మధ్యలో కంపోస్టును వేసుకోవాలి. మొక్కలను పైపైనే నాటుకుని, పాదు చుట్టూ కొంచెం మట్టిని కుప్పగా వేయాలి. చేతితో గట్టిగా అదమకూడదు.  

 10 -12 రోజులకోసారి పైపాటు చేసి కలుపును నిర్మూలించాలి. అంతర కృషి చేసిన వెంటనే జీవామృతం లేదా వర్మీ కంపోస్టును అందించాలి. తెగుళ్లను నివారించేందుకు వెల్లుల్లి + అల్లం ద్రావణం, రసం పీల్చే పురుగుల నివారణకు ఎకరానికి 10 లీ. నీమాస్త్రాన్ని 100 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఛత్తీస్‌గఢ్ గిరిజన రైతులు రుజువు చేశారు. మెరుగైన యాజమాన్య చర్యలతో 15-20 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.
 - సాగుబడి డెస్క్ (saagubadi@sakshi.com)
 
 ఆగస్టు వరకు నాటుకోవచ్చు...
 రాగులతో చేసే సంప్రదాయ వంటలు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను దరి చేరనీయవు. పాత పద్ధతుల్లో సాగు  వల్ల దిగుబడి తక్కువ వచ్చి రైతులకు గిట్టుబాటు కావటం లేదు. శ్రీ పద్ధతిలో సాగు చేస్తే రెండింత ల దిగుబడి పొందవచ్చు. జూలై ఆఖరు వరకు నార్లు పోసుకోవచ్చు. ఆగస్టు మూడో వారం వరకు పంటను నాటుకోవచ్చు.
 - మీసాల మురళి (94940 12228), జట్టు సంస్థ, తోటపల్లి, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు