పందిరి వేద్దాం..పాకిద్దాం..

10 Sep, 2014 02:30 IST|Sakshi

 ఖమ్మం వ్యవసాయం: ఉద్యానశాఖ ద్వారా రాయితీ పొంది జిల్లాలో 135 ఎకరాల్లో శాశ్విత పందిర్లపై తీగజాతి కూర పంటలను సాగు చేస్తున్నారు. శాశ్విత పందిరిపై బీర సంవత్సరానికి మూడుసార్లు, కాకర, సొర రెండు సార్లు, బోడ కాకర ఒక పంటను తీసుకునే వెసులుబాటు ఉంది. శాశ్విత పందిర్లతో తీగజాతి సాగు ద్వారా ఎకరాకు రూ.2.50 లక్షల ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ అధికారులు  చెబుతున్నారు.

శాశ్విత పందిర్లతో కూడిన కూరగాయ పంటల్లో పాటించాల్సిన మెళకువలు తెలుసుకుద్దాం...
 రకాలు:
  కాకర: యూఎస్- 6214, యూఎస్- 33, మహికోగ్రీన్, వినయ్, ఉజాల, పీహెచ్‌బీ, పునమ్
  సొర: మహికో వరద్, రవీనా, యూఎస్-161, శ్రామిక్, కావేరి
  బీర: సురేఖ, నిశాంత్, సానియా-4, యూఎస్-134, సరిత  దొండ, పొట్ల, బోడ కాకర లోకల్ రకాలు


  వాతావరణం: వేడి వాతావరణం అనుకూలం.
  నేలలు: నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలం.

 విత్తనం విత్తే పద్ధతి: భూమి మీద పాకించే పాదులు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవటానికి రెండు మీటర్ల దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో పాదులకు పొలం అంతట నీటిపారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదులకు మూడు విత్తనాలను 1-2 సెం.మీ లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావున్న కొమ్మలు నాలుగు కణుపులున్నవి రెండు చొప్పున నాటుకోవాలి. వర్షాధారంతో కూడిన అన్ని తీగజాతి కూర పంటలను 15ఁ10 సెం.మీ కొలతలున్న పాలిథిన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తరువాత అదను చూసి నాటుకోవాలి.

విత్తన శుద్ధి: కిలో విత్తనానికి  మూడు గ్రాముల థైరమ్, ఐదు గ్రాముల ఇమడాక్లోప్రిడ్‌తో ఒకదాని తరువాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి.

ఎరువులు: విత్తేముందు ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు, 32-40 కిలోల భాస్వరం, 16-20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. 32-40 నత్రజనినిచ్చే ఎరువును రెండు సమభాగాలుగా చేసి విత్తిన 25-30 రోజులు అంటే పూత, పిందే దశలో వేయాలి.

కలుపు నివారణ: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. రెండు, మూడు తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పిండిమిథాలిన్ 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24-48 గంటలలోపు పిచికారీ చేయాలి.


ఆడపువ్వుల నిష్పత్తి పెంచుట: మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కలిపి పిచికారీ చేస్తే ఆడపువ్వుల నిష్పత్తి పెరుగుతుంది.

  నీటి యాజమాన్యం: బిందు సేద్యం ద్వారా నీరు పారించటం మంచింది.

 సస్యరక్షణ:   పెంకు పురుగులు: పిల్ల పురుగులు పెరుగుద ల దశలో ఉన్న ఆకులు, పూలను కొరికి తిం టాయి. దీని నివారణకు మూడు గ్రాముల కార్బొరిల్ లేదా రెండు మి.లీ మలాథీన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 
పొట్ల ఆకు పురుగు: గొంగళి పురుగులు ఆకు లు, పూలను తింటాయి. నివారణకు 2.5 మి.లీ క్లోరీఫైరీఫాస్ లేదా 2 మి.లీ క్వినాల్‌ఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 
పండు ఈగ: పూత దశలో తల్లి ఈగలు పూలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పరుగులు పిందెలలో చేరి తీవ్రంగా నష్టపరుస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో రెండు మి.లీ మలాథీన్‌ను పూతదశలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
 
తెగుళ్లు
 ఆకుమచ్చ : ఆకులపై ఆకుపచ్చ, ముదురాకుప చ్చ కలిసి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. ఆకుపై భాగంలో పసుపు రంగు, కింద ఊదా రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో రెండు గ్రాముల సాఫ్ లేదా మెటాక్సిల్ యంజెడ్ రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
 
వేరుకుళ్లు: దీనినే ఎండు తెగులు అంటారు. ఈ తెగులు సోకితే తీగలు వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల బ్లైటాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో 250 కిలోల వేప పిండిని వేయాలి. ట్రైకోడెర్మా విరిడీ కల్చర్‌ను భూమిలో వేయాలి.
 
బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి పొడి కప్పబడి ఉంటుంది. పోడి వాతావరణంలో ఈ తెగులు తీవ్రత ఎక్కువ. నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల గంధకం పొడి, లేదా ఒక మి.లీ డైనోకాప్ లేదా రెండు మి.లీ హెక్సాకోనోజోల్ కలిపి పిచికారీ చేయాలి.
 
శంకు/పల్లాకు తెగులు: ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారుతాయి. ఈ తెగులును గుర్తించి వెంటనే కాల్చి వేయాలి. నివారణకు లీటర్ నీటిలో రెండు మి.లీ డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ పిచికారీ చేయాలి.
 
గమనిక: పొట్టదశలో రెండు రోజుల పిందెకు చివర చిన్న రాయిని పురికోసతో కట్టాలి. లేకుంటే కాయలు మెలితిరుగుతాయి.

మరిన్ని వార్తలు