అన్నదాతలకు మాట సాయం!

14 Jun, 2016 14:53 IST|Sakshi
అన్నదాతలకు మాట సాయం!

రైతు స్వరాజ్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అవసరమయ్యే అనేక అంశాలపైన మాట సాయం చేయడానికి హైదరాబాద్‌లో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఖరీఫ్ కాలంలో వివిధ పంటలకు సంబంధించిన సూచనలు, పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా వేసుకోదగిన పంటలు, కరువు సమస్యలు, బ్యాంకు రుణాలు / గుర్తింపు కార్డులకు సంబంధించిన సలహాలు, సందేహాలను ఈ సహాయ కేంద్రం అందిస్తుంది.  రైతులు 08500 98 3300 నంబరుకు ఫోన్ చేసి తెలుగులో సూచనలు, సలహాలు పొందవచ్చు. ఇది ఉచిత ఫోన్ కాదు.

మార్కెట్ నిమ్మతో శ్రీగంధం సాగు బెస్ట్?!
శ్రీగంధం, ఎర్రచందనం వంటి ఖరీదైన దీర్ఘకాలిక కలప పంటలు సాగు చేసే క్షేత్రంలో నిరంతర ఆదాయాన్నిచ్చే అరుదైన పండ్ల జాతులను కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు ఉద్యాన తోటల రైతు సుఖవాసి హరిబాబు. తన శ్రీగంధం, ఎర్రచందనం తోటలో ఎకరం విస్తీర్ణంలో 90కి పైగా విశిష్టమైన పండ్ల జాతుల మొక్కల్ని కూడా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.

 
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామ పరిధిలో పది ఎకరాల్లో హరిబాబు రెండేళ్ల క్రితం నుంచి శ్రీగంధం, ఎర్రచందనం తోటను సాగు చేస్తున్నారు. అందులో ఒక ఎకరంలో అత్యంత అరుదైన సుమారు 90 జాతుల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. మన వాతావరణానికి అనువుగా ఉండే దక్షిణాసియా దేశాల్లో పెరిగే ప్రత్యేకమైన పండ్ల జాతులను శ్రద్ధతో వెదికి తెచ్చి సాగు చేస్తుండడం విశేషం. వాటర్ యాపిల్, రాంభూన్, లాంగాన్, అవకాడో, పుల్సాన్, గార్సినియా గుంగట, కోస్టస్ ఉడ్‌సోని, డ్రాగన్ ఫ్రూట్ వంటి అనేక జాతులు ఆయన తోటలో కనిపిస్తాయి. నాటిన ఏడాది నుంచే కొన్ని జాతులు ఫలాలనిస్తున్నాయి. పర్యాటక అభిరుచి కలిగిన హరిబాబు ఎక్కడ ప్రత్యేకమైన పండ్ల మొక్క కనిపించినా తెచ్చి తన తోటలో నాటుతున్నారు.

 పడావుగా ఉన్న నల్లరేగడి భూమిని కొని, అడుగు మందాన ఎర్రమట్టి పోసి మొక్కలు నాటడం విశేషం. వరుసల మధ్య, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఏడాదిన్నర క్రితం 3 వరుసలు శ్రీగంధం, ఒక వరుస ఎర్రచందనం నాటారు. పొలం చుట్టూ ఇనుప కంచె వేసి.. వాక్కాయ చెట్లు పెంచారు. శ్రీగంధం మొక్కకు అడుగు దూరంలో ఒక వరుసలో మార్కెట్ నిమ్మ (ఏడాదికే కాపుకొస్తుంది. ఐదారు అడుగులకు మించి పెరగదు), ఒక వరుసలో కంది వేశారు. అయితే, కంది పక్కన ఉన్న శ్రీగంధం మొక్కలకన్నా మార్కెట్ నిమ్మ పక్కన ఉన్న శ్రీగంధం మొక్క ఏపుగా పెరుగుతున్న విషయాన్ని తన అనుభవంలో గ్రహించానని హరిబాబు చెబుతున్నారు. శ్రీగంధంతోపాటు థాయ్ జామరెడ్, మాంగోస్టిన్, రాంభూటాన్, శాంటాల్, వెల్వెట్ ఆపిల్, రామాఫలం, వాటర్ యాపిల్ వంటి మొక్కలను కూడా కొద్దినెలలుగా ప్రయోగాత్మంగా కలిపి పెంచుతున్నారు.

 12 రకాల నూనెలతో పోషణ
 తోటకు డ్రిప్ ద్వారా నీటితోపాటు 12 రకాల నూనెల మిశ్రమాన్ని హరిబాబు అందిస్తున్నారు. వేప, వేరుశనగ, కానుగ, ఇప్ప, పత్తి, వరి తవుడు, పొద్దుతిరుగుడ, ఆముదం, నువ్వులు, కొబ్బరి నూనెలతోపాటు చేప నూనెను సమపాళ్లలో కలిపి ఎకరానికి కిలో చొప్పున డ్రిప్ ద్వారా నీటితోపాటు ఇస్తున్నారు. సంవత్సరానికి ఎకరానికి 25-30 లీటర్ల నూనెల మిశ్రమాన్ని వాడుతున్నారు. నూనె బరువులో 10 శాతం వరకు ఎమల్సిఫయర్‌ను కలిపి వాడుతున్నారు. దీనితోపాటు 20 రోజులకోసారి జీవామృతాన్ని ఎకరానికి 230 లీటర్ల చొప్పున మొక్కల పాదుల్లో పోస్తున్నారు. నూనెల మిశ్రమాన్ని, జీవామృతాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నందున తోటలో మొక్కలు పోషక లోపం, తెగుళ్ల బెడద లేకుండా ఏపుగా పెరుగుతున్నాయని హరిబాబు (94412 80042) సంతోషంగా చెప్పారు.

అంజూర ఆకులతో గ్రీన్ టీ!

ఆరోగ్యదాయకమైన గ్రీన్‌టీని తయారు చేసుకోవడానికి కుండీల్లో పెంచుకునే వివిధ మొక్కల ఆకుల పొడి శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు. తులసి, మునగ, స్టీవియా ఆకుల పొడితో టీ తయారు చేసుకోవడం తెలిసిందే. అదే జాబితాలో అంజూర కూడా చేరింది. అంజూర ఆకుల టీ తాగితే మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. పెద్ద ఆకులను కోసి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన ఆకులను నలిపి పొడి చేసి పెట్టుకోవాలి. లీటరు నీటిలో రెండు చెంచాల పొడిని వేసి 15 నిమిషాలు.. నీరు సగం ఆవిరయ్యే వరకు మరగబెట్టి.. వడకడితే టీ సిద్ధమైనట్లే. ఇలా తయారు చేసుకున్న టీని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకొని కూడా వాడుకోవచ్చు.
 
 - పంతంగి రాంబాబు,  సాగుబడి డెస్క్ ఫొటో: కందల రమేష్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్

మరిన్ని వార్తలు