కంకుల చుట్టూ ముళ్లు.. కావలికి చెల్లు!

27 Feb, 2017 23:37 IST|Sakshi
కంకుల చుట్టూ ముళ్లు.. కావలికి చెల్లు!

కంకుల చుట్టూ ముళ్లుండే రకం జొన్న పంటను సాగు చేస్తూ గడచిన పదేళ్లుగా నిలకడగా ఆదాయం ఆర్జిస్తున్నారు నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్‌ గ్రామ రైతులు. గతంలో ఆ గ్రామంలోని రైతులు రబీ పంటగా తెల్ల, ఎర్ర జొన్నలను సాగు చేసేవారు. చెట్లు, బీడు భూములు ఎక్కువగా ఉండటంతో  పక్షుల తాకిడి ఎక్కువగా ఉండేది. పంట చేతికొచ్చే సమయంలో ఇవి జొన్న పంటను ఆరగించేసేవి. ఎన్ని పనులున్నా మానుకొని మరీ కుటుంబంలో ఒకరు పగలంతా కావలి కాయాల్సి వచ్చేది. దాదాపు 40 రోజులు ప్రతి రైతు కుటుంబంలోనూ ఒక మనిషి పూర్తిగా ఆ పనికే సమయం కేటాయించాల్సి రావటంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అధిక విస్తీర్ణంలో జొన్న పంటను సాగు చేసే రైతులు పక్షులు పంటపై వాలకుండా చూడటానికి అమితంగా శ్రమించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ముళ్లజొన్న సాగు ఆ గ్రామ రైతుల పాలిట ఆపద్బాంధవిగా మారింది.  

ముళ్లజొన్న పంట కాలం నాలుగు నెలలు. ఇది ప్రధానంగా పశుగ్రాసానికి పనికొచ్చే రకం. వెల్కటూర్‌ రైతులు విత్తన పంటగా సాగు చేస్తున్నారు. ప్రైవేట్‌ కంపెనీలు ముళ్లజొన్న విత్తనాలను రైతులకు ఇవ్వటంతో పాటు, సాగు చేసిన పంటను తిరిగి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పటి నుంచి ఈ గ్రామంలో ముళ్లజొన్న సాగు క్రమంగా పెరిగి ప్రస్తుతం 600 ఎకరాలకు చేరింది.

ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని అక్టోబర్‌ ఆఖరివారంలో ప్రతి 18 సాళ్లకు ఒక సాలు చొప్పున మగ విత్తనాన్ని విత్తుకున్నారు. వారం విరామం తర్వాత మధ్య సాళ్లలో ఆడ విత్తనాన్ని విత్తుకున్నారు. కూలీలతో ఒకసారి కలుపు తీయించారు. నాలుగు తడులు ఇచ్చారు. వరికోత మిషన్‌తో పంట నూర్పిడి చేశారు. ముళ్ల జొన్నల తొడిమె నలుపు రంగులోను, గింజ లేత ఎరుపు రంగులోను ఉంటాయి. జొన్న కంకి చుట్టూ ముళ్లు ఉండటం వల్ల పిట్టలు పంటను పాడుచేసేందుకు సాహసిం^è డం లేదు.

ముళ్ల జొన్నలో ఎకరాకు 22 –25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాల్‌కు రూ. 1,800 కనీస ధరగా ఒప్పందం చేసుకొని విత్తన కంపెనీ కొనుగోలు చేస్తున్నది. పచ్చ, తెల్ల జొన్నలు మార్కెట్‌లో క్వింటాలుకు రూ. 2,100 పలుకుతుంటే విత్తన ముళ్ల జొన్నలకు రూ. 100 – 150లు ఎక్కువ ధర రైతులకు అందుతోంది. దుక్కి, ఎరువులు, కూలీలు వంటి ఖర్చులు రూ. 6 వేలు పోను ఎకరాకు రూ. 30 వేల నికరాదాయం రైతులకు లభిస్తోంది. కావలి కాయాల్సిన అవసరం లేకపోవటంతో రైతులు ఇతర పొలం పనులకు సమయాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు చీరలు కట్టటం, దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయటం, టపాసులు కాల్చటం వంటి పద్ధతులను గతంలో అనుసరించేవారు. ముళ్లజొన్న సాగు వల్ల రైతులకు ఆ శ్రమ తప్పి, నికరాదాయం పెరిగింది.
– బొమ్మెన భూమేష్, సాక్షి, బాల్కొండ, నిజామాబాద్‌ జిల్లా  

చీడపీడలు రావు,చాకిరీ తక్కువ!
ముళ్లజొన్నలో మంచి దిగుబడి వస్తున్నది. చీడపీడలు రావు. పక్షుల కోసం కావలి కాయాల్సిన అవసరం లేదు. చాకిరీ తక్కువ. అందుకే 10 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నా.
– గుండేటి సాయిరెడ్డి
(99124 75349), ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మండలం, నిజామాబాద్‌ జిల్లా


కంకుల చుట్టూ ముళ్లుంటాయి!
ముళ్ల జొన్న కంకులకు చుట్టూతా ముళ్లు ఉంటాయి. దీంతో పక్షులు కంకులపై వాలాలంటేSభయ పడుతున్నాయి. ముళ్ల జొన్నను పిట్టల నుంచి కాపాడుకోవడానికి  కాపలా ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిశ్చింతగా సాగు చేస్తున్నా.
– రాజేశ్వర్‌ (99124 16865) ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మండలం, నిజామాబాద్‌ జిల్లా

పిట్టలతో ఎలాంటి బాధ లేదు
నిరుడు వరకు ఎర్ర జొన్న పంటను సాగు చేశాను. కాపలా కాయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ఏడాది ముళ్ల జొన్న పంటను సాగు చేశాను. ఇప్పుడు పిట్టలతో ఎలాంటి బాధ లేదు.
– రాజన్న, ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మం., నిజామాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు