జైలు యాత్ర

11 Aug, 2016 01:10 IST|Sakshi
జైలు యాత్ర

ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో నిలిపిన తరం ఆ రోజుల్లో జైళ్ల నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న నేటి తరం జైళ్ల వైపు ప్రయాణం చేస్తోంది.
 

తెలంగాణ జైళ్ల శాఖ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నది. ఒకరోజు జైలు గదిని యాత్రికులకు అద్దెకి ఇస్తుంది. ఎవరైనా డబ్బు చెల్లించి వెళ్లిరావచ్చు. 219 సంవత్సరాల చరిత్ర గల సంగారెడ్డి జైలు, మ్యూజియంని ప్రజలు చూడడానికి ప్రారంభిస్తూ జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ గారు ఈ విషయాన్ని తెలియచేశారు. ఉద్దేశం? జైళ్లలో మగ్గడం ఎంత బాధాకరమో ప్రజలు స్వయంగా తెలుసుకుని జైలుకు వెళ్లే పనులు మానుకుంటారని. అక్కడ ఖైదీలు తినే బొచ్చెలోనే అన్నం పెడతారు. వారిలాగే నేల మీద నిద్రపోవాలి. ‘జైలు రుచి చూడండి!’ అనే పథకాన్ని వారు అమలు జరపబోతున్నారు.

నాకేమో సింగ్ గారు బొత్తిగా అమాయకులుగా, పెద్దమనిషిగా కనిపిస్తున్నారు. అయ్యా, ఈ రోజుల్లో ఎవరూ జైళ్లలో మగ్గడం లేదు. హాయిగా, నక్షత్రాల హోటళ్లలో ఉన్నట్టు సుఖంగా ఉన్నారు. ముఖ్య మంత్రులూ, కేంద్ర మంత్రులూ, ముఖ్యమంత్రుల ముద్దుల కూతుళ్లూ తరచు వెళ్లి వచ్చే జైళ్లు మగ్గే ధోరణిలో ఎందుకుంటాయి సార్? కావాలంటే సుబ్రతోరాయ్‌ని అడగండి. మొన్నే తాజాగా వెళ్లివచ్చిన మేడమ్ జయలలితని అడగండి. త్వరలో వెళ్లబోతున్న విజయ్ మాల్యా గారి కోసం జైళ్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగు తున్నాయని వినికిడి.  అక్కడ సరసమైన ధరలకు మత్తు పదార్థాలు దొరుకుతాయనీ, మొబైల్ ఫోన్లు మనకి సరిగ్గా పనిచేయకపోవచ్చు గానీ మొబైల్ కంపెనీలు జైళ్లలో ఉన్న పెద్దల విషయంలో అలాంటి రిస్కులు తీసుకోరనీ వినికిడి. చక్కని భోజనం, వ్యాపార చర్చలు జరుపుకోవడానికి సుబ్రతోరాయ్‌గారికి అన్ని సౌకర్యాలు జైల్లో కల్పించవల సిందిగా సుప్రీంకోర్టు ఆ మధ్య తాఖీదులు ఇచ్చింది.

నేను బ్రిటిష్‌వారి పాలనలో పుట్టాను. నా తరంలో జైలుకి వెళ్లి రావడం ఒక ఘనతగా, త్యాగానికి ప్రతీకగా చెప్పుకునేవారు. ‘‘ఆయన జైలుకు వెళ్లివచ్చారు’’ అంటే గొప్పగా, గర్వంగా చెప్పుకునేవారు. స్వాతంత్య్రం వచ్చాక జైలుకి వెళ్లి వచ్చిన యోధులకు ప్రత్యేకమయిన గుర్తింపులను ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఆనాటి వైభవం.

ఇప్పుడు జైలుకు వెళ్లివచ్చినవారూ, వెళ్లవలసిన వారూ మనకి పార్లమెంటులో, శాసనసభలలో దర్శనమిస్తున్నారు.

మన దేవుడు జైల్లోనే పుట్టాడు. మధురలో శ్రీకృష్ణుడు అవతరించిన జైలు గదిని చూశాను. అండమాన్ దీవులలో సెల్యులార్ జైలును చూశాను. ఆ త్యాగధనుల్ని తలుచుకుని కంటతడి పెట్టాను. ముఖ్యంగా వీర సావర్కర్ జైలు గది. ఇక- దక్షిణా ఫ్రికాలో జోహెన్స్‌న్‌బర్గ్‌లో రాబిన్ ద్వీపంలో నెల్సన్ మండేలా దాదాపు పాతిక సంవ త్సరాలు ఉన్న జైలుని చూసి తరించాను.

ఓ సరదా అయిన కథ. 1931లో రాయవెల్లూరు సెంట్రల్ జైలుకి సన్నగా రివటలాగ నల్లకళ్లద్దాలతో ఉన్న కొత్త ఖైదీని తీసుకొచ్చారు. ‘ఎవరీయన?’ అనడిగాడు ఓ ఖైదీ. ప్రొఫెసర్ ఎన్. జి. రంగా అనే ఖైదీ సమాధానం ఇచ్చారు. ‘ఆయన రాజగోపాలాచారి. ఈ దేశానికి గవర్నర్ జనరల్ కాగలిగిన సామర్థ్యం ఉన్నవాడు’. మరొక 17 సంవత్సరాలకి రాజాజీ గవర్నర్ జనరల్ అయ్యారు. నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ జైల్లో రాశారు. అదీ ఆనాటి ఖైదీల వైభవం.

తన జీవితకాలంలో గాంధీ మహాత్ముడు 13సార్లు జైలుకి వెళ్లారు. ఏ నేరమూ చెయ్యని మరొక వ్యక్తి కూడా జైలులో ఉన్నారు. ఆవిడ పేరు కస్తూరిబా గాంధీ.

మరో కథ. 1908లో ప్రఫుల్ల చకీ, ఖుదీరాం బోస్ అనే ఇద్దరు విప్లవకారులు అప్పటి ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ని చంపడానికి బాంబు వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్టు చేసింది. బాలగంగాధర తిలక్ వారి తరఫున వాదించడానికి సిద్ధపడి దేశద్రోహ నేరం కింద అరెస్టయ్యారు. ఆయన్ని మాండలే జైలులో పెట్టారు. తిలక్ జైల్లో  భగవద్గీతా రహస్యం అనే గీతా భాష్యాన్ని రాసి - ఆ పుస్తకం ముద్రితమయ్యాక - దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముని స్వతంత్ర పోరాట నిధికి జమ చేశారు. ఇవి ఆనాటి కొన్ని నమూనా జైలు కథలు.

మహాకవి దాశరథి నిజాం కాలంలో ఇందూరు జైల్లో వట్టికోట ఆళ్వారుస్వామి వంటి సహచరులతో ఉంటూ తన ప్రముఖ కావ్యం ‘అగ్నిధార’ రాశారు. అక్కడ నుంచే ‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తారు. ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో నిలిపిన తరం ఆ రోజుల్లో జైళ్ల నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న తరం ప్రస్తుతం జైళ్ల వైపు ప్రయాణం చేస్తోంది. సింగ్‌గారూ! క్షమించండి. మీరు ఒక తరం ఆలస్యంగా కొత్త ఆలోచన చేశారు. ప్రస్తుతం మేము ఉన్న జైలు మాకు చాలు.


 

రచయిత: గొల్లపూడి మారుతీరావు

 

మరిన్ని వార్తలు