డల్లాస్‌లో కృష్ణమూర్తికి సన్మానం

30 Apr, 2017 23:31 IST|Sakshi
డల్లాస్‌లో కృష్ణమూర్తికి సన్మానం

యూఎస్‌ కాంగ్రెస్‌ మెంబర్‌గా రాజా కృష్ణమూర్తి ఎన్నికైన సందర్భంగా డాల్లస్‌లో శనివారం విజయోత్సవ సభ నిర్వహించారు. డాల్లస్‌లోని టచ్‌నైట్‌ క్లబ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయ మిత్రులు పాల్‌ పాండియన్‌, డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, ఎంవీఎల్‌ థియోఫిన్‌, శ్రీధర్‌ తుమ్మలలు రాజ కృష్ణమూర్తి విజయానికి కృషి చేశారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర రాజా కృష్ణమూర్తిని సభకు పరిచయం చేస్తూ ఆయన చాలా భాద్యత గల సభ్యుడని, అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ లో తన గళాన్ని వినిపిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముందంజలో ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం జరిగిన 236 రోల్ కాల్స్ లో 235కి హాజరవడం రాజా చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు.

రాజా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న అంశాలు:
1. ఉద్యోగాలను సృష్టించడం ద్వారా  మన ఆర్ధికవ్యవస్థను వృద్ధి చేయడం

2. వర్కింగ్ ఫ్యామిలీస్ కోసం అండగా నిలబడడం

3. మహిళలకు సహాయ పడటం

4. ఒబామా  “ఎఫోర్డ్బెల్   కేర్ యాక్ట్” ను సమర్ధించడం

5. సీనియర్స్  కు ఇచ్చిన  వాగ్దానాలను నిలబెట్టడం

6. దేశ  భద్రతను  కాపాడటం

7. యుద్ధాల్లో పోరాడిన సైనికులను  గౌరవించడం


పలు అంశాలను కేంద్రీకరిస్తూ ఆశించిన ఫలితాల కోసం త్రీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాజా కృష్ణమూర్తి ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్ సభ్యుడిగా విద్య మరియు ఉద్యోగుల కమిటీ, పర్యవేక్షణ మరియు ప్రభుత్వ సంస్కరణల కమిటీల్లో కీలక సభ్యుడిగా పని చేస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒబామా కేర్ యాక్ట్ ను తొలగించాలని ప్రయత్నాలు చేసినప్పుడు, దాన్ని వ్యతిరేకిస్తూ రాజా ధృడంగా నిలబడ్డారని తెలిపారు. ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించినప్పుడు కూడా రాజా తీవ్రంగా వ్యతిరేకించారని వివరించారు.

చికాగోలోని ఓహారే అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది ముస్లిం దేశస్తులను ఇమిగ్రేషన్ అధికారులు ప్రవేశాన్ని అడ్డుకున్నారనే విషయాన్ని తెలుసుకుని, హుటాహుటిన అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్న ప్రజలకు మద్దతు తెలుపడం ద్వారా రాజా ప్రజల మనిషిగా నిరూపించుకున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి కాంగ్రెస్ కు ఎన్నిక కావడానికి సహకరించిన డాలస్ మిత్రులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మున్ముందు అమెరికా రాజకీయాల్లో రాజా ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలని డాక్టర్ తోటకూర ఆకాంక్షించారు.

రాజా కృష్ణమూర్తి తన ప్రసంగంలో భారతీయ అమెరికన్లకు చాలా ఓర్పు గల వారని, వాళ్ళు అవసరమైనప్పుడు హక్కులను కాపాడుకోవటం కోసం గళాన్ని ఐకమత్యంగా వినిపించాలని చెప్పారు. లేకుంటే అమెరికా జనజీవన స్రవంతిలో వెనుక బడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు హాజరైన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ.. మనమందరం కొంత సమయం కేటాయించి అమెరికా పార్లమెంట్ ను సందర్శించాలని, అక్కడి కార్యకలాపాలు, కాంగ్రెస్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం ఎంతో అవసరం అని తెలిపారు. ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లోనూ అగ్రపథంలో ఉన్నపటికీ రాజకీయ రంగంలో ఇంకా ఎంతో పురోగతి సాధించాలని ముఖ్యంగా ఆసక్తి గల యువతరం రాజకీయాల్లోకి రావాలని రాజా కోరారు. రాజా చివరిగా డాలస్ లోని ప్రజలు తన విజయానికి ఎంతో కృషి చేశారని అందుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

అనంతరం డాల్లస్‌ ఆహ్వాన సంఘం, మద్దతుదారులు రాజా కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. నిర్వాహకులలో ఒకరైన ఎంవీఎల్ ప్రసాద్ రాజా కృష్ణమూర్తికి పూల దండ వేయగా, డాక్టర్ ప్రసాద్ తోటకూర, సి.సి. థియోఫిన్ రాజాకు శాలువా కప్పి, జ్ఞాపికను బహుకరించారు. రాజా కేక్ కట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. సి.సి. థియోఫిన్ తన వందన సమర్పణలో ఎంతో ఆప్యాయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డాలస్ నగరాన్ని విచ్చేసి, తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన రాజా కృష్ణమూర్తికి, ఎంతో ప్రోత్సాహం ఇస్తున్న డాల్లస్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు