అమ్మ భాషకు నీరాజనం

14 Sep, 2017 01:21 IST|Sakshi
అమ్మ భాషకు నీరాజనం

అమ్మ భాష సరిగా రానివారికి ఇతర భాషలు ఒంటపట్టడం కల్ల అన్నది జార్జి బెర్నార్డ్‌ షా చెప్పిన మాట. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు సైతం ఆ సంగతే వెల్లడించాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో భాషాభిమానం అధికం. వారితో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు–ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాతృభాషకు ఎంతో అన్యాయం జరుగుతోందని భాషాభిమానులు చాన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకున్న రెండు నిర్ణయాలు ఊరట కలిగిస్తాయి. ఒకటో తరగతి మొదలుకొని పన్నెండో తరగతి వరకూ తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలన్నది అందులో ఒకటి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ ఇకపై బోర్డులన్నిటినీ తెలుగులోనే రాయాలన్నది మరో నిర్ణయం. ఉత్తరాది రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటకల్లో బోర్డులన్నీ అక్కడి భాషల్లో ఉంటాయి. కనీసం ఆ దుకాణాలు లేదా సంస్థలు ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించినా ఇంగ్లిష్‌లో ఒక్క ముక్క కూడా రాసి ఉండదు.

మన దగ్గర మాత్రం సామాన్యులకు అర్ధం కాకుండా ఇంగ్లిష్‌లోనే బోర్డులుంటాయి. ఆమధ్య తెలుగులో కూడా ఉండాలన్న నిబంధన పెట్టడం వల్ల ఏదో ఒక మూల దాన్ని రాయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ చెబుతున్న ప్రకారం బోర్డులు ఇకపై తెలుగులో తప్పనిసరిగా ఉండాలి. ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టం. తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నది. దాన్ని పాటించే విద్యా సంస్థలకు మాత్రమే మాత్రమే రాష్ట్రంలో అనుమతులుంటాయని కూడా కేసీఆర్‌ చెప్పారు. దీనికి కొనసాగింపుగా మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ తెలుగు పాఠ్యాంశాలకు తెలంగాణ సాహిత్య అకాడమీ పాఠ్య ప్రణాళికలను రూపొందించి పుస్తకాలు ముద్రించాలని, వాటిని మాత్రమే అన్ని విద్యా సంస్థలూ అనుసరించవ లసి ఉంటుందని కూడా నిర్దేశించారు.

భాషా వికాసానికి జరిగే కృషిలో ప్రభుత్వాలది క్రియాశీలక పాత్ర. ఆ పాత్రను ప్రభుత్వాలు సక్రమంగా పోషిస్తేనే మాతృభాష బతికి బట్ట కడుతుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాక దేశంలో అవతరించిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. చిత్రమేమంటే ఆ తర్వాత పదేళ్లకుగానీ తెలుగును అధికార భాషగా గుర్తించే తీర్మానం శాసనసభ చేయలేకపోయింది. ఆ విషయంలో ఉత్తర్వులు జారీ చేయడానికి ఏళ్లూ పూళ్లూ పట్టింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు డిగ్రీ స్థాయి వరకూ మాతృభాషలో విద్యా బోధన ఉండాలని సంకల్పించి తెలుగు అకాడమీకి ఆ బాధ్యత అప్పగించి అన్ని పాఠ్యాంశాలూ తెలుగులో లభ్యమయ్యేందుకు దోహదం చేశారు.

ఆ విషయంలో తర్వాత వచ్చిన పాలకులు మరింత చురుగ్గా వ్యవహరించి తెలుగుపై శ్రద్ధ పెట్టి ఉంటే భాషా వికాసం మరింతగా సాధ్యమయ్యేది. భాష జాతికి తల్లివేరులాంటిది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఏ జాతి అయినా ఎదుగుతుంది. ఈ సంగతి మనకంటే తమిళనాడు, కర్ణాటక నేతలకు బాగా తెలుసు. మాతృభాష కళ్లయితే పరాయిభాష కేవలం కళ్లజోడని తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై అన్నారు. ఆ దృష్టితోనే ఆయనా, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తమిళభాషకు పెద్ద పీట వేశారు. దాని సర్వతోముఖాభివృద్ధికి పాటుబడ్డారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు ఆచరణలో సమస్యలెదురయ్యే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటిచోట్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడుస్తున్నాయి.

ఆ సంస్థలు సైతం తెలుగును ఇకపై ఒక పాఠ్యాంశంగా బోధించడం తప్పనిసరి. అలాగే కొన్ని విద్యా సంస్థలు వేటికవి వేర్వేరు ప్రైవేటు ప్రచురణకర్తలు వెలువరించిన తెలుగు పుస్తకాలను వాడుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇది కుదరదు. చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం ఉంటే ఈ నిబంధనలు అమలయ్యేలా చూడటం పెద్ద కష్టం కాదు. ఏ ప్రాంత భాష అయినా నేర్చుకోవాలనుకునేవారు అందుకు శాస్త్రీయంగా రూపొందించిన పాఠ్యాంశాన్నే అనుసరించాలి. ఆ పాఠ్యాంశం అక్కడి సంస్కృతిని, నుడికారాన్ని ప్రతిబింబించాలి. అప్పుడు మాత్రమే తాము ఉంటున్న రాష్ట్రం గురించిన సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
  
తెలుగు భాషా వైభవానికి కృషి చేస్తానని చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఇంతవరకూ ప్రగతి సాధించకపోగా అందుకు విరుద్ధమైన పోకడలకు పోతున్నారు. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక బడ్జెట్‌ కేటా యిస్తామని వాగ్దానం చేశారు. తెలుగు భాషా పీఠం ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం ప్రతిపత్తిగల ప్రాధికార సంస్థను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రత్యేక తెలుగు కేంద్రం ఉంటుందన్నారు. వీటన్నిటికీ మించి తెలుగును రెండో జాతీయ భాషగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ ‘రెండో జాతీయ భాష’ గురించి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద కనీసం ప్రస్తావనైనా తెచ్చారో లేదో అనుమానమే.

కనీసం పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు సైతం ఇంతవరకూ దీని ఊసెత్తలేదు. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చినా అది నామమాత్రం గానే మిగిలింది. తెలుగుకు పల్లకీ మోత సంగతలా ఉంచి మున్సిపల్‌ పాఠశాలలను ఒక్క కలం పోటుతో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తూ గత జనవరిలో ఉత్తర్వులు జారీచేశారు. అందుకు సంబంధించి అభ్యంతరాలు తలెత్తడంతో తెలుగు మీడియం కూడా కొనసాగుతుందని ప్రకటించారు. కనీసం ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వ తాజా నిర్ణయాలను గమనించాకైనా బాబులో మార్పు వస్తే... మాతృభాషా పరిరక్షణకు కృషి చేస్తే మంచిదే.

మరిన్ని వార్తలు