సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి

18 Mar, 2016 19:59 IST|Sakshi
సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి

విశ్లేషణ
కన్హయ్య జైలు నుంచి విడుదలైన రోజు నేను, ప్రొఫెసర్ సోమ సుందరం జేఎన్‌యూకు వెళ్లాం. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం దగ్గర సాయంత్రం ఆరు గంటల నుంచి విద్యార్థినీ విద్యా ర్థులు; ప్రభాత్ పట్నాయక్, జయతీ ఘోష్ వంటి మేధావులు, పూర్వ విద్యార్థులు కన్హయ్య కోసం పదకొండు గంటల వరకు వేచి ఉన్నారు. అర్ధరాత్రి 12.30 లకి సభ జరిగితే కన్హయ్య ఉపన్యాసాన్ని అంతా శ్రద్ధగా విన్నారు. అతడు వాడిన ప్రతి పదానికి ఆనందంగా చప్పట్లు చరిచారు. ఆ భావాలను ఆహ్వానించారు.

 

మార్క్సిజం పేరు చెప్పకుండానే ఆ సిద్ధాంతాన్ని బోధించాడు. దళితులు- కమ్యూనిస్టులు కలవాలనే మాట చెప్పకుండానే ఎరుపు - ఆకునీలం ఆహార ప్లేట్లను ఉదహరిస్తూ, సాధించవలసిన కలయిక గురించి స్పష్టంగా చెప్పాడు. పార్లమెంట్ సమా వేశాలు జరుగుతున్న సమయం. తన హావభావాలన్నీ రంగరించి సభ్యులను మెప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ శాయశక్తులా కష్టపడుతున్నారు. రాహుల్ గాంధీ మీద విరుచుకు పడుతున్నారు.
 
బయట మీడియాలో ఒకవైపు మోదీ, మరోవైపు కన్హయ్య బొమ్మలు చూపుతూ సవాల్-ప్రతి సవాల్, ప్రశ్న- జవాబులతో దేశదేశాలలో ఈ అంశం మార్మోగిపోయింది. గత ముప్పయ్యేళ్లలో ఇలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకుని సమర్థంగా మాట్లాడి, విద్యార్థిలోకాన్ని ఉత్తేజ పరిచిన ఘటన లేదని మేధావులు మొదలు అంతా కొనియాడుతున్నారు. ఒక సర్వే ప్రకారం కన్హయ్య ఉపన్యాసాన్ని 1 కోటి 80 లక్షల మంది ఆలకించారు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన మోదీ గారిని అభినందించకుండా ఉండలేక పోతున్నాను. అంతటి స్థాయికి ఎదిగిన కన్హయ్య మీద అనైతిక ప్రక్రియలు ఇంకా కొనసాగిస్తున్నారు. వార్తా వాహినిలో డాక్ట్రిన్ చేయడం ద్వారా అతడిని ముద్దాయిని చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. జరిగిన అవమానం చాలక, మళ్లీ సంఘ్ పరివార్ తాబేదారు మీడియా ద్వారా బురద చల్లడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
 
విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలు,  అబ్బాయిలు కలసి తిరగడం సహజం. ఎక్కడైతే యువతీయువకులు కలసి మెలిసి తిరుగుతారో అక్కడ భగ్న ప్రేమికులు, యాసిడ్ దాడులు ఉండవు. కానీ ఈ వాస్తవాన్ని గమనిం చకుండా ఫొటోలు మార్ఫ్ చేయించి విడుదల చేస్తున్నారు. అమ్మాయిలు సిగరెట్లు, మద్యం తాగుతున్నట్టు ఫేస్‌బుక్‌లో ఫొటోలతో మాయ చేస్తున్నారు. కుప్పలు కుప్పలుగా కండోమ్‌లు దొరుకుతున్నాయని బీజేపీ నాయకులు అవమా నకరంగా మాట్లాడుతున్నారు. జేఎన్‌యూలో సంఖ్యా రీత్యా హిందువులే ఎక్కువ. అయినా వారి మీదే లజ్జాకరమైన ప్రకటనలు చేస్తున్నారంటే, మన పిల్లల మీద మనమే చేయని నేరాన్ని మోపి పైశాచికానందం పొందవచ్చునని మనుస్మృతి చెప్పిందా? వాస్తవాన్ని అవాస్తవంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించమని నాగ్‌పూర్ కేంద్రం నూరి పోస్తున్నదా?
 
జైపూర్ ఆరెస్సెస్ కేంద్రంలో అట్టహాసంగా సభలు జరిగాయి. అక్కడ పేదరికం ఎలా పోగొట్టాలి? ఆర్థికంగా దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి? తదితర అంశాల మీద మచ్చుకైనా మాట్లాడలేదు. పేదరికం, కరువుకాట కాలతో ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు ఒకవైపు; మరో వైపు విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి పారి శ్రామికవేత్తలు వేల కోట్లు మొదలు లక్షల కోట్ల రూపా యలు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము  దుర్వి నియోగం చేసి విదేశాలలో కేళీవిలాసాలతో కాలక్షేపం చేస్తున్నారు. వారంతా బీజేపీ వారసపుత్రులే. అలాంటి వారి మీద చర్య తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యా మని ఆరెస్సెస్ సభలో చర్చించరు.
 
అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే విదేశా లలోని నల్లధనాన్ని వెనక్కు తెస్తామంటూ చేసిన హామీ  నెరవేరలేదు. పైగా అక్కడి బ్యాంకులలోని నల్లధనం మాయమైపోతున్నది. ఆ నల్లధనాన్ని బంగారంగా మార్చి, దేశంలోకి తెచ్చి బాండ్ల రూపంలో తెల్లడబ్బుగా మార్చు కునే ప్రక్రియ ఎన్డీఏ హయాంలో యథేచ్ఛగా జరుగుతోంది. అఫ్జల్‌గురును కీర్తించే పీడీఎఫ్‌తో జమ్మూకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల మాటేమిటి? దీని మీద ఆరెస్సెస్ విధానం ఏమిటి? వీటి మీద వారు ఎందుకు మౌనంగా ఉన్నారు?
 
స్వదేశీ భక్తి- విదేశీ తొత్తులు- ఇది తరుచు ఆరెస్సెస్ చేసే నినాదం. మోదీ దేశంలో కంటే విదేశాలలోనే ఎక్కువగా పర్యటించారని అంచనా. విదేశీ కార్పొరేట్ సంస్థలకు ఎన్ని రాయితీలు ఇచ్చారు? ప్రపంచంలో చైనా తరువాత భారత్ జనాభాయే ఎక్కువ. ఇక్కడ అపార మార్కెట్‌కు అవకాశం ఉంది. కానీ చైనా మార్కెట్ తీరు వేరు. తమ వ్యాపార వ్యవస్థకు అనుకూలంగా ఉండే భారత్ రావడానికే విదేశీ కంపెనీలు తహతహలాడు తున్నాయి. వీరికి అనుకూలంగా విదేశీ పెట్టుబడులకు ఎన్డీఏ తలుపులు బార్లా తెరిచింది. విదేశీ నిధులను పారిశ్రామిక, నీటి పారుదల అవసరాలకు ఉపయోగించు కుంటే ప్రయోజనం. అలా కాకుండా సర్వీస్ రంగాల మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. దేశంలో అద్భుతాలు సృష్టించే నిపుణులు ఉన్నారు. వారి ప్రతిభను గుర్తించకుండా ఇతర దేశాల వెంట ఎన్డీఏ ప్రతినిధులు పరుగులు తీస్తున్నారు.
 
దాదాపు 280 విదేశీ విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వాటికి సదుపాయాలు కల్పించడానికి వెచ్చిస్తున్న దానిలో 10 శాతం ఇక్కడి విశ్వవిద్యాలయాల మీద ఖర్చు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. కానీ ఎందుకీ విదేశీ విధ్వంసం. ఇక్కడే ఉంది మతలబు. విదేశీ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలలో రిజర్వేషన్లు ఉండవు. దళితులు, బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కాషాయ మానసపుత్రులకు, అగ్ర వర్ణాలకు రుచించదు. విదేశీ విశ్వవిద్యాలయాల వంటి అంశం మీద ఆరెస్సెస్ పెద్దలు ఎందుకు చర్చించరు? అధికారంలో ఉండగానే విద్యా విధాన నిర్ణయాల వ్యవస్థలో కాషాయ భక్తులను నియమించుకోవాలి.

 

న్యాయ, పాలనా వ్యవస్థలతో పాటు,  సైన్యం సహా మతవాదులతో నిం పాలి. ఏబీవీపీకి కాయకల్ప చికిత్స చేసి, ప్రత్యర్థులను; ముఖ్యంగా లౌకిక, ప్రగతిశీల భావాలు కలిగిన వారిని పాలక వ్యవస్థ ద్వారా ఎలా తప్పించాలో జైపూర్ సభలో చర్చించారు. నిక్కర్లను వీడి ప్యాంట్లకు ఎదగాలని కూడా నిర్ణయించారట. అధికారం వచ్చింది కదా, ఇంకా నిక్కర్లెందుకు? అధికారం పోయాక ఎలాగూ నిక్కర్లే కట్టాలి. ఇంతై వటుడింతై అన్నట్టు కన్హయ్య ఎదిగితే ఆజానుబాహుడు మోదీ మరుగుజ్జుగా మారారు. ఎదిగిన కన్హయ్యకు అభినందనలు. సైజు తగ్గిన మోదీకి నా సానుభూతి.

(వ్యాసకర్త: నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి)
మొబైల్: 9490952222
 

 

>
మరిన్ని వార్తలు