అలుపెరుగని అనువాదకుడు ఏజీ యతిరాజులు

24 Feb, 2017 01:24 IST|Sakshi
అలుపెరుగని అనువాదకుడు ఏజీ యతిరాజులు

నివాళి
ఎనభై సంవత్సరాల వయసులో కూడా అలుపెరుగ కుండా తెలుగు, తమిళ భాషల్లో అనువాద రంగంలో నిరంతరం కృషి చేసిన సృజనకారుడు ఏజీ యతి రాజులు. తెలుగు, తమిళ సాహిత్యాభిమానులకు గత 56 సంవత్సరాలుగా వీరు సుపరిచితులే. తమిళనాట వీరి గ్రంథాలు పది ముద్రణలు పొందాయి. హోవర్డ్‌ ఫాస్ట్‌ – ‘స్పార్టకస్, అలెక్స్‌ హేలీ– ‘ఏడు తరాలు’, డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’, కళ్యాణరావు ‘అంట రాని వసంతం’ తదితర పుస్తకాలను తమిళంలోకి అను వదించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రాసిన 12 హిందీ గ్రంథాల అనువాదాలకు కేంద్ర, తమిళనాడు పురస్కారా లను అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త గిజుభాయి సాహిత్యాన్ని హిందీ నుంచి తెలుగుకి అనువదించారు.

తమిళనాడులోని గుడియాత్తంలో చేనేత కుటుం  బంలో 1935 ఆగస్టు 4న యతిరాజులు జన్మించారు. మునెమ్మ, గోవిందస్వామి వీరి తల్లిదండ్రులు. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషలలోనూ, ఆయా భాషల సాహిత్యంతోనూ మంచి పరిచయం ఉంది. మాతృభాష తెలుగు. చిత్తూరు జిల్లాలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

పదేళ్ల వయసులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక నెలకొన్న దారుణ కరవు పరిస్థితుల్లో ఆకలి, దారిద్య్రం, అభద్రతా భావనలు బాల్యంలోనే తన పైన తీవ్ర ప్రభావాన్ని చూపాయంటారు. శేరు బియ్యం కోసం ఒక రోజంతా వరు సలో నిలబడటం తనకింకా బాగా గుర్తుందం టారు. యుద్ధాలవల్ల స్త్రీలు, పిల్లలు, సాధారణ ప్రజా నీకం ఎన్ని అవస్థలు పడతారో, జీవితం ఎంత దారు ణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన కారణంగానే హింసకు, యుద్ధానికి తాను వ్యతిరేకం అంటూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే దుష్టశక్తుల్ని వ్యతిరేకించే సాహిత్యమే తనకు అత్యంత ప్రమాణీకరమైందని అంటారు యతిరాజులు.

‘రోజూ పుస్తకాలు చదువుతారా సార్‌’ అన డిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే– వారి సాహిత్య వ్యక్తి త్వాన్ని తెలియ జేస్తుంది. ‘రోజూ అన్నం తింటాం కదా అని తినటం ఏరోజూ మానెయ్యం కదా? అట్లాగే చదవటం కూడా నిరంతరం కొన సాగుతూనే ఉండాలి’ అంటారు. కేవలం కాల్పనిక సాహిత్యమే కాక, చరిత్ర, సామాజిక శాస్త్రాలకు చెందిన ఎన్నో విలువైన గ్రంథాల్ని, అంతే విలు వైన ఆత్మకథల్ని, స్వీయ చరిత్రల్ని కూడా యతిరాజులు తెలుగు, తమిళ, హిందీ భాష ల్లోకి అనువదించారు. రాయటానికి చేయి సహకరించకపోయినా తాను చెబుతూ డీటీపీ చేయించడం విశేషం. ఇంత వయసులో కూడా వీరు నిత్య చదువరిగా ఉండటం అద్భుతమైన విషయం. వివిధ భాషల్లోని ప్రగతిశీల మానవతా రచన లను ఇతర భాషలకు అందజేయటం వీరికి చాలా ఇష్ట మైన ప్రవృత్తి.



తెలకపల్లి రవి,
వరప్రసాద్‌ (సాహితీ స్రవంతి)

మరిన్ని వార్తలు