విన్నపాలు వినవలె.. | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె..

Published Fri, Feb 24 2017 1:17 AM

విన్నపాలు వినవలె.. - Sakshi

సర్కారుకు శాఖల ‘బడ్జెట్‌’ విజ్ఞప్తులు

వెయ్యి కోట్లిచ్చి ఆదుకోండి: ఆర్టీసీ
‘డబుల్‌’కు రూ.20 వేల కోట్లు: గృహ నిర్మాణ శాఖ
రూ.3,800 కోట్లు కావాలి: బీసీ సంక్షేమ శాఖ


సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. అప్పులు, బకా యిలు, నష్టాల వల్ల జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందిగా ఉన్నందున ఈసారి బడ్జెట్‌లో రూ.1,064 కోట్లిచ్చి ఆదుకోవాలని ఆర్టీసీ ఎండీ రమణారావు కోరారు. ఈ మేరకు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డికి ఇటీవల ఆయన ప్రతిపాదనలు అందజేశారు. ప్రభు త్వం చెల్లించాల్సిన రూ.590 కోట్ల బస్సు పాసుల రాయితీ మొత్తం, ప్రభుత్వ పూచీతో తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించిన రూ.334.72 కోట్లతో పాటు కొత్త బస్సుల కొనుగోలుకు రూ.140 కోట్లు చెల్లించాలని వాటిలో కోరారు.

డబుల్‌ బెడ్రూమ్‌లకు రూ.20 వేల కోట్లు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు అవసరమవుతా యని గృహనిర్మాణ శాఖ నిర్ధారించింది. ఇందుకు బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని, హడ్కో నుంచి రూ.17 వేల కోట్లు రుణం తీసుకో వాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఇతర విభాగాల ఇళ్లకుమరో రూ.2 వేల కోట్లు కలిపి మొత్తం రూ.5 వేల కోట్లు కోరారు. ఇక, బలహీన వర్గాల కాలనీల్లో ఈసారి భారీగా రామాలయాల నిర్మాణం చేపట్టనున్నందున సర్వశ్రేయో నిధికి రూ.100 కోట్లు కేటాయించాలని దేవాదాయ శాఖ కోరింది.

కొత్త జిల్లాల ఆవిర్భావంతో అన్ని జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు సమకూర్చుకోవాల్సి ఉన్నందున రూ.167 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ అధికారులు కోరారు. హరితహారానికి ప్రభుత్వ ప్రాధాన్యత నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖకు రూ.800 కోట్లు, కుల వృత్తులకు ప్రోత్సాహం తదితరాల నిమిత్తం బీసీ సంక్షేమ శాఖకు రూ.3,800 కోట్లు కోరుతూ ఆ శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని సంబంధిత మంత్రులకు అందజేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement