భద్రత పట్టదా?

19 Oct, 2016 00:45 IST|Sakshi
భద్రత పట్టదా?

మూడు రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రెండు విషాద ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. ఈ నెల 15న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జైగురుదేవ్ అనుయాయులు నిర్వహించిన ఊరేగింపులో తొక్కిసలాట జరిగి 25మంది మరణించగా, 50మందికి పైగా గాయపడ్డారు. సోమవారం రాత్రి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఒక ఆసుపత్రిలో మంటలు వ్యాపించి 22మంది మరణిం చారు. మరో వందమంది వరకూ గాయపడ్డారు. కొంచెం అప్రమత్తతతో వ్యవహ రించి ఉంటే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈ రెండు ప్రమాదాలూ నివారించదగ్గవే.

తొక్కిసలాటలకు సంబంధించి గత పదేళ్ల గణాంకాలు గమనిస్తే ఇంచుమించు ప్రతి ఏటా అవి పునరావృతమవుతూనే ఉన్నాయి. వేలాదిమంది పాల్గొనే ఉత్సవాలు, ఊరేగింపుల విషయంలో అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాటి నిర్వాహకులతో చర్చించడం, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉన్నదో తెలుసుకోవడం, అందుకు తగిన ఏర్పాట్లున్నాయో లేదో సమీక్షించి, లోటుపాట్లు నివారించడం అధికారుల పని.

అంచనాకు మించి లేదా అనుమతించిన పరిమితులను పట్టించుకోకుండా జనాన్ని తరలిస్తున్నట్టు గమనించిన పక్షంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్న స్పృహ వారికి ఉండాలి. నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం ఆ తర్వాత సంగతి. కానీ అనుకోనిదేదైనా జరిగితే నిర్వాహకులను తప్పుబట్టడం, వారిపై కేసులు పెట్టడంతో సరిపెట్టుకుంటున్నారు. అవి యధాప్రకారం న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ పడతాయి. పర్యవసానంగా తుది తీర్పు వెలువడే సమయానికి తగిన సాక్ష్యాధారాలుండవు. ఎవరికైనా శిక్షలు పడినా అవి మళ్లీ అప్పీల్‌కు వెళ్తాయి.  నిరుడు జూలైలో పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి 29మంది ప్రాణాలు కోల్పోయారు. కారణాలేమిటో అందరికీ తెలుసు. అందుకు వీడియో సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కానీ విచారణ కమిషన్‌కు అధికారుల నుంచి సహకారం లేదు. కమిషన్‌కు పొడిగించిన కాలపరిమితి కూడా గత నెలతో ముగిసింది. ఇక పోలీసు దర్యాప్తు సంగతి చెప్పనవసరమే లేదు.
 
అగ్ని ప్రమాదాల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం ఉంటోంది. 2005లో జాతీయ భవన నిర్మాణాల కోడ్‌ను రూపొందించారు. అందులో భవనాలను నిర్మించిన ప్పుడు పాటించాల్సిన కనీస ప్రమాణాలున్నాయి. అయినా ఆకాశాన్నంటే భవం తుల్లో, పారిశ్రామిక వాడల్లో, దుకాణ సముదాయాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భువనేశ్వర్ ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలంటుకున్నాయి. ఏదైనా భవంతి నిర్మించినప్పుడు లేదా పరిశ్రమ నెలకొల్పినప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ఆరా ఉంటుంది. ఎన్నో విధాల పరిశీలించాక, నిబంధనలన్నిటినీ పాటించారని సంతృప్తి చెందాక నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ అలారమ్ ఏర్పాటు చేశారో, లేదో... అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు వెదజల్లే వ్యవస్థ ఉన్నదో లేదో, ప్రమాదాలు సంభవించినప్పుడు అక్కడున్నవారంతా వెనువెంటనే బయటపడటానికి అనువైన మార్గాలున్నాయో లేదో చూస్తారు. అంగీకరించిన నిబంధనలను పాటించలేదని తేలినపక్షంలో కఠిన చర్యలకు వీలుగా కేసులు పెట్టాల్సి ఉంటుంది.

ఈ బాధ్యతలన్నిటినీ అగ్నిమాపక విభాగం చూడాలి. అయితే వారు కేసులు పెట్టడమే తప్ప, ఆ కేసుల వ్యవహారాలను చూడటానికి అందులో ప్రత్యేక విభాగం ఏదీ లేదు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలకు సంబంధించి జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ చాన్నాళ్లక్రితం ఎన్నో సూచనలు చేసింది. మన దేశంలో చాలినన్ని అగ్నిమాపక కేంద్రాలు లేవని, మంటలు ఆర్పడానికి వినియోగపడే వాహనాలు లేవని చెప్పింది. అన్నిటికీ మించి సిబ్బంది కొరతే ఆ విభాగాన్ని ప్రధానంగా వేధిస్తున్నదని వివరించింది. ఏడు నెలలక్రితం ఇచ్చిన సూచనల్లో ప్రత్యేకించి ఆసుపత్రి భవంతుల నిర్మాణం, నిర్వ హణ ఎలా ఉంటున్నాయో ఆ సంస్థ ఏకరువు పెట్టింది. కనీసం 30,000మంది జనాభాకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలన్న నిబంధన ఉన్నా, మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించవలసిన అవసరం ఉన్నా ఎవరికీ పట్టదు. ఏళ్లు గడుస్తున్నా ఈ విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుం టున్న దాఖలాలు లేవు. అగ్నిమాపక విభాగం తీరే ఇలా అఘోరిస్తే ఇక అది ప్రమాదాలనెలా అరికడుతుంది? కారకులైన వారిపై చర్యలెలా తీసుకుంటుంది?
 
ఆసుపత్రులు, దుకాణ సముదాయాలు, పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు తదితర చోట్ల అగ్ని ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. తాము నిబంధనలన్నిటినీ పాటిం చామని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని భువనేశ్వర్ ఆసుపత్రి యాజ మాన్యం అంటోంది. మరి ప్రమాదం ఎలా జరిగినట్టు? షార్ట్ సర్క్యూట్ ఎలా సంభవిం చినట్టు? మంటలంటుకున్నాక దాన్నుంచి బయటపడటం కోసం పరుగులు పెడితే అన్ని వైపులా గేట్లు మూసి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రోగులు కొందరు గేట్లు బద్దలు కొట్టడం వల్ల కొంతమందైనా ప్రాణాలు దక్కించుకున్నారు. అయిదేళ్లక్రితం కోల్‌కతాలో ఒక ఆసుపత్రిలో మంటలు వ్యాపించి 89మంది మర ణించారు. ఆ ఆసుపత్రి డెరైక్టర్లను అరెస్టు చేశారు. కేసులు పెట్టారు. కానీ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

నిరుడు చెన్నైలో వరద లొచ్చినప్పుడు ఒక ఆసు పత్రిలో విద్యుత్ అంతరాయం వల్ల ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న 18మంది రోగులు మర ణించారు. ప్రైవేటు ఆసుపత్రులనే కాదు... ప్రభుత్వ ఆసుపత్రులు కూడా భద్రతకు సంబంధించిన అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రమాదాల్లో చిక్కు కున్నవారిని కాపాడాల్సిన ఆసుపత్రులే ఇంత దారుణమైన స్థితిలో ఉండటం విచార కరమైన విషయం. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా బాధ్యులపై చర్యలు తీసుకుంటామనడం, విచారణ కమిషన్లు నియమించడం...ఆ తర్వాత పట్టించుకోక పోవడం మన దేశంలో రివాజుగా మారింది. అందుకే ఇవి పునరావృతం అవు తున్నాయి. జవాబుదారీతనం ఉండేలా, బాధ్యులపై వెను వెంటనే చర్యలుండేలా ప్రభుత్వాలపై ఒత్తిళ్లు వస్తే తప్ప ఈ స్థితి మారదు.

మరిన్ని వార్తలు