Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు

19 Nov, 2023 05:43 IST|Sakshi

వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్‌ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్‌ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు.

టెక్నికల్‌ రిపోర్ట్‌ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్‌ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్‌ నవంబర్‌ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్‌ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే.

ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు  పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్‌ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్‌ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది.

మరిన్ని వార్తలు