స్వేచ్ఛా విహంగాలు (స్ట్రే బర్డ్స్)

12 Sep, 2016 00:53 IST|Sakshi
స్వేచ్ఛా విహంగాలు (స్ట్రే బర్డ్స్)

ఎందుకు అనువదించానంటే?

తెలుగునాట చలం ద్వారా రవీంద్రనాథ్ టాగోర్ కవిత్వానికి అభిమానులైన అనేకమందిలో నేనూ ఒకడిని. ఆ మార్ధవం, లాలిత్యం, తాత్వికత, మరీముఖ్యంగా కవిత్వం నన్నెంతో ఆకర్షించాయి. టాగోర్ ఇతర రచనలకోసం అంతర్జాలంలో వెతకగా దొరికినవాటిలో నన్ను ఆకర్షించినవి స్ట్రే బర్డ్స్, క్రిసెంట్ మూన్.
 
స్ట్రే బర్డ్స్ 1916లో వచ్చింది. నేటికి సరిగ్గా వందేళ్ళు. ఇది రెండుమూడు వాక్యాలుండే 326 లఘు కవితల సంపుటి. ఒక్కో కవితా హైకూలా ఉంటుంది కానీ పాదవిభజన ఉండదు. ఏక వాక్యంలా సాగుతుంది. ఒక్కొక్కటి స్వేచ్ఛగా తిరిగే విహంగాల లాంటి ఆలోచనలకు అక్షర రూపాలు. ఇవి ఒక అందమైన పదచిత్రాన్నో లేక జీవితసత్యాన్నో తెలుపుతాయి.

గుంపుగా ఎగిరే విహంగాలకు వేటి స్వేచ్ఛ వాటికుంటుంది. కానీ అన్నీ ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి. ఆ మార్గమే టాగోర్ కవితాత్మ. 1915లో టాగోర్ ఒకనాడు- నది ఒడ్డున ప్రశాంత జలాలనుండి అనంతాకాశంలోకి ఎగిరిపోతున్న కొంగల గుంపును చూసి, ఆ పక్షుల చలనం స్వేచ్ఛా జీవనానికీ, ఆలోచనకూ ప్రతీక అని భావించి ఈ పుస్తకానికి ‘స్ట్రే బర్డ్స్’ అన్న పేరు పెట్టాడంటారు.

స్ట్రే బర్డ్స్‌లోని వాక్యాలలోని కొన్ని టాగోర్ ఇతర రచనలైన ‘కణిక’,‘లేఖన్’లలో కనిసిస్తాయి. వీటిని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి టాగోరే స్వయంగా అనువదించుకొన్నాడు. ఇతర కవితలను నేరుగా ఇంగ్లీషులోనే రచించాడు.తొలిసారిగా చదివినపుడు స్ట్రే బర్డ్స్ నన్ను సమ్మోహపరచింది. మరల మరల చదువుకొన్నప్పుడు ఆ కవితలలో గొప్ప సార్వజనీనత, తాత్వికత, సరళత కనిపించాయి. నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలని అనిపించి 2008లో అనువదించి, నా బ్లాగులో పెట్టినపుడు మంచి స్పందిన లభించింది. దీనిని ‘స్వేచ్ఛా విహంగాలు’ పేరిట ఇప్పుడు పుస్తకంగా తెచ్చాను.

‘అతను తన ఆయుధాలను/ తన దేవుళ్ళుగా చేసుకొన్నాడు/ అతని ఆయుధాల విజయం అతని ఓటమి’ అన్న వాక్యంలో టాగోర్ మానవజాతి ప్రస్థానాన్ని మూడు ముక్కల్లో చెప్పాడా అనిపిస్తుంది. ఈ పుస్తకం వచ్చిన సమయంలో మొదటి ప్రపంచయుద్ధం జరుగుతూన్నది. ఒక తుపాకి పేలటం మానవత్వం ఓటమిగా భావించాలన్న టాగోర్ మాట కాలదోషం పట్టని ప్రాపంచిక విషయం.

‘మృత్యువు అనే ముద్ర, జీవితం అనే నాణేనికి యోగ్యతనిస్తుంది/అప్పుడు మాత్రమే దానితో ప్రియమైన వాటిని కొనగలం’ అనే వాక్యంలో, జీవితాన్ని ప్రేమమయం చేసేది మృత్యువు మాత్రమేనన్న గొప్ప తాత్వికతను చాల సరళంగా చెపుతాడు టాగోర్.

 ‘చిన్నారి గడ్డిపోచా!/ నీ పాదం చిన్నదే కావొచ్చు కానీ/ పుడమి మొత్తం నీ అడుగుల క్రిందే ఉంది’ అనే వాక్యం పైకి ప్రకృతి వర్ణణలా అనిపించినా తరచి చూస్తే దానిలో జీవితం పట్ల ఉండాల్సిన ఆశావహ దృక్పథం వ్యక్తమౌతుంది.ఈ అనువాదం చేసేటపుడు రూపస్వేచ్ఛా, అక్కడక్కడా భావస్వేచ్ఛా తీసుకొన్నాను. ఇది నాకు అర్థమైన కోణాన్ని ఆవిష్కరించటానికి చేసిన ఒక ప్రయత్నంగానే భావిస్తాను.

 

     స్వేచ్ఛా విహంగాలు; మూలం: టాగోర్; పేజీలు: 68; వెల: 75; ప్రతులకు: అనువాదకుడు, 30-7-31, సూర్యనారాయణపురం, కాకినాడ.
 

 

 

రచయిత: బొల్లోజు బాబా   
9849320443


 

మరిన్ని వార్తలు