పాలకుల వాగాడంబరం

3 Feb, 2017 00:35 IST|Sakshi
పాలకుల వాగాడంబరం

సందర్భం
ప్రమాదకరమైన ఔషధ పరిశ్రమలను పచ్చటి పైరులతో ఉండే ముచ్చర్ల వద్దకు తెస్తున్నందుకు కేటీఆర్, కేసీఆర్‌లు గర్వపడుతున్నారు. ఫార్మారంగంలో గుత్తాధి పత్యం సాధించిన వారికి మరింత మేలు చేసేందుకే ఫార్మాసిటీ తెస్తున్నారా?

తెలంగాణ ప్రభుత్వం రూపొం దించిన టీఎస్‌ ఐపాస్‌ దేశానికే ఆదర్శమంటూ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రకటించారు. ఆయన భక్తులైన మంత్రులు, ఎమ్మె ల్యేలు ఓ అడుగు ముందుకేసి ఎక్కడా ఇటువంటి విధానం లేదు, ఇది ప్రపంచా నికేSఆదర్శం అని ప్రకటించేశారు. కొత్త పరిశ్రమలు పెట్టే వారికి, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తగిన రీతిలో ప్రోత్సాహం ఇస్తామని మంత్రి కేటీఆర్‌ పదే పదే ప్రకటనలు ఇస్తున్నారు. అందుకోసం ఆయనగారు విదే శాలకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబ డులు రావడం, కొత్త పరిశ్రమలు రావడం మన రాష్ట్ర అభివృద్ధికీ, ఉద్యోగాల కల్పనకీ ఉపయోగపడితే తప్ప కుండా ఆహ్వానించాల్సిందే. కానీ కొత్త ఉద్యోగాలు రాక పోగా ఆ పేరుతో వనరుల సంతర్పణ జరిగితే మాత్రం ఎవరైనా వ్యతిరేకించాల్సి ఉంటుంది.

‘‘తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపి స్తాం, సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని’’ టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్త యింది. ఈ కాలంలోనే నిజాం షుగర్స్‌ పరిశ్రమ, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మూతపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలాపూర్‌ బిల్టు పరిశ్రమ మూతపడింది. మిల్లును తెరిపిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ‘‘నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామ’’ని ఎన్నికల ప్రణా ళికలో చెప్పారు. అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్‌ పరిధిలోని మూడు ప్లాంట్లలో ఉత్పత్తి ఆగిపోయింది. కంపెనీ మూత పడింది. కేసీఆర్, ఆయన కూతురు స్థానిక ఎంపీ కవిత, ఫ్యాక్టరీ పరిధిలోని మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే ఇదే అంశంపై ఇదిగో అదిగో తెరుస్తున్నాం అంటూ ప్రకటనలు చేశారు.

నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో ఉన్న నిజాం షుగర్స్‌కు మెదక్‌ మంబోజిపల్లిలో, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోనూ యూనిట్లు ఉన్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో ప్రత్యక్షంగా దాదాపు రెండువేల రెండువందల మంది, పరోక్షంగా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందేవారు. వీరు గాక రైతులు, చెరకుతోటల్లో పనిచేసే కార్మికులు మరో యాభైవేల మంది ఉండేవారు. ఇంత ఉపాధికి, ఈ జిల్లాల ఆర్థికాభివృద్ధికి మూలాధారం అయిన షుగర్‌ ఫ్యాక్టరీ మూత పడి వీరంతా రోడ్డున పడ్డారు. ఈ బాధి తులందరినీ మహాజన పాదయాత్ర సందర్బంగా మేము ప్రత్యక్షంగా కలుసుకున్నాం. మెదక్‌ మంబోజిపల్లిలోని యూనిట్‌ను కూడా సందర్శించాము. ఈ కీలకమైన పరిశ్రమను తెరిపించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఘనత వహించిన కేసీఆర్‌ చేసిన కృషి ఏంటో చెప్పాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిజాం షుగర్స్‌ ప్రస్తావన వచ్చినప్పుడు ‘‘నిజాం షుగర్స్‌ అనేది ముగిసి పోయిన అధ్యాయం’’ అంటూ కేసీఆర్‌ మాట్లాడారు. విపక్ష సభ్యులు ప్రశ్నిస్తే మీరు నడుపుతారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. సీఎంగారి అబద్ధాలకు, మాట మార్చడానికి ఇంతకంటే రుజువు ఏముంటుంది?

సిర్పూర్‌ పేపర్‌ మిల్లుది కూడా అదే పరిస్థితి. ఐదు వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ముప్పయివేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్న పరిశ్రమ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మూతపడింది. ఈ మిల్లు కార్మిక సంఘం నేతగా సాక్షాత్తు రాష్ట్ర, మరియు కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. కాగజ్‌ నగర్‌ ప్రాంతం దాదాపుగా ఈ  మిల్లుపై ఆధారపడి బతుకు తోంది. మిల్లు మూతపడ్డ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నలుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మెుత్తం 17 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో నిజాం కాలంలో స్థాపించిన ఫ్యాక్టరీ అంటూ గొప్పగా రాశారు. ఫ్యాక్టరీ మూత పడు తుంటే కళ్లప్పగించి చూశారు తప్ప కనీస చర్యల్లేవు.

రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కల్పించే బిల్టు పరిశ్రమ విషయంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి అదే విధంగా ఉంది. పరిశ్రమలోని ఉత్పత్తికి మార్కెట్‌ సౌక ర్యం లేదంటూ యాజమాన్యం కంపెనీని హఠాత్తుగా మూసివేసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఎన్నికలు ముగిసాయి. టీఆర్‌ఎస్‌ రెండున్న రేళ్లుగా అధికారంలో ఉంది. కానీ కమలాపూర్‌ బిల్టు కార్మి కుల బతుకులు ఇంకా రోడ్డుపైనే ఉన్నాయి. 250 కోట్ల రూపాయలు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. కానీ నేటికీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. బిల్టు యాజ మాన్యాన్ని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రెండోసారి ప్రయత్నించలేదు. 21 నెలలుగా వేతనాలు లేక  కుటుం బాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
   
ముడిసరుకులు లభించే పరిశ్రమలన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలి. తెలంగాణలో పత్తి ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో సాగవుతున్న మెుత్తం పంటల్లో పత్తిపంట సాగు 60 శాతానికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్పిన్నింగ్, జిన్నింగ్‌ మిల్లులు ఏర్పాటు చేసి రైతుల నుండి నేరుగా పత్తిని కొనవచ్చు. కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. చెరకు విరివిగా పండే మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో చక్కెర పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులు తెచ్చేందుకు సర్కార్‌ ప్రయత్నం చేయాలి. వరి ఎక్కువగా పండే ప్రాంతాల్లో రైసు మిల్లు పరిశ్రమ ఒక్కటే కాకుండా దాని ఉప ఉత్పత్తుల పరిశ్రమలను స్థాపించే విధంగా ప్రోత్సహించాలి. వ్యవసాయంతో ముడిపడి ఉన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయల పెట్టుబడి అవసర ముండదు.

కాబట్టి చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్స హించేందుకు కృషి చేస్తే వ్యవసాయ రంగమూ, పారిశ్రా మిక రంగమూ అభివృద్ధి అవుతుంది. వందలాది ఎక రాల భూములు పందేరం చేసినా పెద్ద పరిశ్రమలు పూర్తి యాంత్రీకరణ చేసినా కనీసం వెయ్యిమందికి కూడా ఉపాధినివ్వడం లేదు. కాబట్టి చిన్న తరహాæ, మధ్య తరహా పరిశ్రమలు, పర్యావరణానికి ఇబ్బంది లేని పరి శ్రమలు వచ్చేలా కృషి చేయాలి. భారీ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీల్లో సగం ఇచ్చినా ఈ పరిశ్రమలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. ఖనిజ వనరులు అధికంగా ఉన్నచోట పరిశ్రమలు స్థాపించాలి. వికారా బాద్‌ లాంటి చోట్ల నాపరాయి పరిశ్రమలు, ఇనుప ఖనిజం లభించే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం ప్రాంతంలో బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక విధానం రూపొం దించాలి. అప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన అభి వృద్ధి ఫలాలు అందుతాయి.

(‘మహాజన పాదయాత్ర’లో భద్రాచలం నుంచి)
వ్యాసకర్త సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం

మరిన్ని వార్తలు