రేప్‌ చేసిన చేతులకు రాఖీలా?

18 Aug, 2017 00:53 IST|Sakshi
రేప్‌ చేసిన చేతులకు రాఖీలా?

అభిప్రాయం
ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లా పాల్నార్‌ గ్రామంలోని బాలికల వసతి గృహంలో 500 మంది ఆదివాసీ బాలికలు ఉన్నారు. రాఖీ పండుగ రోజున అక్కడి పాఠశాలను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సందర్శిం చారు. ఈ పాఠశాల పిల్లలతో సీఆర్‌íపీఎఫ్‌ సైనికులకు రాఖీ లు కట్టించాలని వారికి ఆలోచన వచ్చింది.

జూలై 31నే ఈ పథకాన్ని రచించి వందమంది జవాన్లను తీసుకొని ఆ వసతి గృహానికి వెళ్లారు. అధికారులు ఈ రాఖీ కట్టే దృశ్యాన్నంతా వీడియో తీసే ఏర్పాటు కూడా చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆదివాసీ మహిళలకు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సంరక్షకులుగా ఉన్నారని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చూపాలనుకున్నది. రక్షాబంధన్‌ రోజు ఆ కార్యక్రమాన్ని లైవ్‌ షో చేయాలనుకున్నారు. అందుకని రాఖీ పున్నమి రోజు చాలాసేపటి వరకు ఆ కార్యక్రమం కొనసాగింది.

ఉదయం నుంచి ఈ కార్యక్రమం చాలాసేపు కొనసాగడంతో కొంతమంది బాలికలు కార్యక్రమం మధ్యలో మరుగుదొడ్డికి వెళ్లారు. వాళ్లను ఐదారుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అనుసరించారు. తాము మరుగుదొడ్ల లోపల ఉండగా బయట ఇట్లా జవాన్లు నిలబడడానికి ఆ అమ్మాయిలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ జవాన్లు బెదిరిం చారు. మీ శరీరంలోని రహస్య ప్రదేశాల్లో ఏం దాచుకున్నారో మేం వెతకాల్సి ఉంటుందని చెబుతూ ముగ్గురు అమ్మాయిల స్థనాలను దారుణంగా నలిపేశారు. ఒక అమ్మాయి మరుగుదొడ్డిలో తలుపు వేసుకొని ఉండిపోయింది. ముగ్గురు సైనికులు తలుపు తోసుకొని లోపలికి వెళ్లారు. 15 నిమిషాలు వాళ్లు ఆ లోపలే ఉండిపోయారు. మిగిలిన అమ్మాయిలను బయట ఉన్న జవాన్లు గొడవ చేయకుండా నోరు మూశారు.

తర్వాత రక్షా బంధన్‌ సంరక్షకుల కార్యక్రమం ముగిసింది. ఆ రాత్రి ఆ బాలికలు తమ వార్డెన్‌ ద్రౌపదీ సిన్హాకు జవాన్లు తమతో వ్యవహరించిన తీరు చెప్పారు. వార్డెన్‌ ఈ విషయాన్ని ఎస్పీ, కలెక్టర్‌ దృష్టికి తెచ్చింది. ఈ ఫిర్యాదు చేసిన అమ్మాయిలను సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు నకు తీసుకురమ్మన్న కలెక్టర్, ఎస్పీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించారు. గ్రామస్తులు చొరవ తీసుకొని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని సోనీ సోరీని పిలిపించారు.

సోనీ సోరీ అక్కడికి వెళ్లినప్పుడు ఆ హాస్టల్‌ వార్డెన్‌ గేటుకు తాళం పెట్టి వాచ్‌మన్‌లాగా గేటు ముందు కూర్చున్నది. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను పై అధికారులు అక్కడ నియమించారు. ఇంక చేసేది లేక సోనీ సోరీ అక్కడి పాఠశాలలో చదివే పిల్లల ఇళ్లల్లోకి వెళ్లి ఆ సంఘటనకు సంబంధించిన సమాచారమంతా సేకరించింది. దంతెవాడలో చాలాకాలం పాటు వనవాసి ఆశ్రమం నిర్వహించి, పోలీసుల దౌర్జన్యంతో ఛత్తీస్‌గఢ్‌ వదిలి వెళ్లిన హిమాంశు కుమార్‌ ఈ సంఘటనను బయటి ప్రపంచం దృష్టికి తెచ్చాడు.

తమపై లైంగిక అత్యాచారం చేసిన జవాన్లకే తాము రాఖీలు కట్టే స్థితికి నెట్టబడిన ఆదివాసీ బాలికలపట్ల ఈ వ్యవస్థ వైఖరి ఏమిటి? ఆదివాసులపై సామూహిక లైంగిక అత్యాచారాలను ప్రోత్సహించిన నేరారోపణపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ముందు రుజువైన పోలీసు ఉన్నతాధికారి కల్లూరిని ఆగస్టు 15న ఒక విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆహ్వానించడం రేప్‌ చేసిన చేతులకు రాఖీలు కట్టించడమనే దుర్మార్గానికి పరాకాష్ట కాదా?


వరవరరావు
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు

మరిన్ని వార్తలు