Raksha Bandhan 2023: అక్కాచెల్లెళ్లకు క్యాష్‌ గిఫ్ట్‌ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్‌ ఏంటో తెలుసా?

31 Aug, 2023 17:58 IST|Sakshi

తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్‌: వివరాల అప్‌డేషన్‌కు కొత్త మార్గదర్శకాలు 

బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్‌ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం.

రూ.2 లక్షలకు మించితే..
ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాక్స్‌ ఉంటుందా?
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్‌ గిఫ్ట్‌ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్‌ పడదు అని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు