నిరసనల జన్మభూమి

12 Jan, 2018 08:19 IST|Sakshi

అడుగడుగునా ప్రజాప్రతినిధులు, అధికారుల నిలదీత

సమస్యల హోరుతో అట్టుడికిన గ్రామసభలు

కొత్త పింఛన్లులేవు.. రేషన్‌ కార్డుల మాటే లేదు

చంద్రన్న సరకుల పంపిణీ నామమాత్రం

‘గత జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదుల సంగతి ముందు చెప్పండి..మాకు పింఛన్లు ఎందుకు పీకేశారు? రేషన్‌ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు?. మా గ్రామాలకు సీసీ రోడ్లు లేవు..మంచినీటి సదుపాయం లేదు..ఇన్నాళ్లు ఏమైపోయారు? ముందు వీటికి సమాధానం చెప్పండి.. ఆ తర్వాతే సభలు పెట్టుకోండి అంటూ’ మంత్రులు, ప్రజాప్రతినిధులనే కాదు.. నోడల్‌ అధికారుల బృందాలను ఎక్కడికక్కడ జనం నిలదీశారు. ముచ్చెమటలు పోయించారు. ఈ నెల 2న ప్రారంభమైన ఐదో విడత ‘జన్మభూమి–మావూరు’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. విశాఖ సిటీతో పాటు మారుమూల గ్రామీణ, ఏజెన్సీ పల్లెల్లో సైతం తొలిరోజు నుంచి చివరి రోజు వరకు నిరసనలతో హోరెత్తిపోయింది. కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం నిలదీశారు. కడిగి పారే శారు. మరికొన్ని చోట్ల సభలను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజల పక్షాన నిలిచి దాదాపు గ్రామసభ జరిగిన ప్రతి చోట ప్రజాసమస్యలపై ప్రజాప్రతి నిధులు, అధికారులను ఎండగట్టారు.

సాక్షి, విశాఖపట్నం: కొత్తగా పింఛన్లు మంజూరు చేశాం..కొత్తగా రేషన్‌ కార్డులు  ఇస్తున్నాం.. ఇంకేముంది ప్రజలు తమకు జేజేలు పలుకుతారంటూ ‘జన్మభూమి–మావూరు’ సభలకు వెళ్లిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అడుగడుగనా నిరసనలు, ప్రతిఘటనలే ఎదురయ్యాయి. కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డుల పంపిణీ మాట దేముడెరుగు గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీల సంగతేమింటూ వెళ్లిన ప్రతిచోటా నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు..శ్రేణులు దాదాపు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో పాల్గొని ప్రజల తరపున అధికారులను నిలదీశారు. కొన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్లు, ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకు న్నాయి. పార్టీ శ్రేణులతో పాటు సామాన్యులను నిలువరించలేక అధికారపార్టీ నాయకులు దౌర్జన్యాలకు సైతం తెగపడ్డారు. నక్కపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, అచ్యుతాపురం, మునగపాక తదితర మండలాల్లో జరిగిన సభలోŠల్‌ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

మంత్రులకూ తప్పని నిరసనలు..
తొలిరోజే మంత్రి గంటా శ్రీనివాసరావుకు సొంత నియోజకవర్గమైన భీమిలి మండలం కాపులుప్పాడలో గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్‌బాబులకు సైతం నిరసనల సెగ తప్పలేదు. ఇక టీడీపీ పంచన చేరిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలకు గిరిజనులు ఏకంగా చుక్కలు చూపించారు. ఇటీవల పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి టీడీపీ తరపున గ్రామాల్లోకి వెళ్తుంటే పొలిమేరల్లో సైతం అడుగుపెట్ట కుండా గంటల తరబడి ఘెరావ్‌ చేశారు. ఇక పల్లెల్లో గ్రామసభలు నిర్వహించిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, నోడల్‌ అధికారులు కనివినీ ఎరుగని రీతిలో నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను ఎదుర్కొనలేక గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు.

70 శాతం సభల్లో ఆందోళనలు..
 జిల్లాలో 923 పంచాయతీలకు నాలుగింట సభలను బహిష్కరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కనీసం మరో వందకు పైగా గ్రామాల్లో ప్రజల నిరసనలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నారు. ఆయా సభలను ఐదు పదినిమిషాల్లోనే ముగించేశారు. మరో 150కి పైగా సభలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. 600కు పైగా సభల్లో నిరసనలు హోరెత్తిపోయాయి. కేవలం 120 పంచాయతీల్లోనే సభలు సజావుగా సాగినట్టుగా అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 190 వార్డుల్లో సభలు జరగ్గా వాటిలో సగానికి పైగా నిరసనలు..నిలదీతలు తప్పలేదు.

అన్నీ కాకిలెక్కలే..
2016 డిసెంబర్‌ నాటికి జిల్లాలో 3,24,932 పింఛన్లు ఉండేవి. 2017 జనవరిలో 15వేలు కొత్తగా మంజూరు చేయగా..వాటి సంఖ్య 3,47,449కు పెరిగింది. కానీ గడిచిన ఏడాదిలో పెంచిన ఆ 10వేలకు పైగా కోత పెట్టేశారు. చివరకు గత నెలలో 3.37లక్షలకు చేరగా..ప్రస్తుతం కొత్తగా మంజూరైన వాటి మాట దేవుడెరుగు జనవరిలో 3,36,607 పింఛన్లు మంజూరుచేయగా జన్మభూమి సభల్లో పంపిణీ చేసింది.  3,07,966 మందికి మాత్రమే పంపిణీ చేయగలిగారు. కొత్తగా పింఛన్ల కోసం 50వేల మంది అప్‌లోడ్‌ చేసుకోగా 30 వేల మందికి పింఛన్లు మంజూరు చేసినట్టుగా ప్రకటించారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ప్రస్తుత జన్మభూమి సభల్లో పింఛన్‌ పంపిణీ చేసిన పాపాన పోలేదు.  రేషన్‌ కార్డుల పరిస్థితి కూడా అంతే. కొత్తగా 21వేల కార్డులు మంజూరు చేశారు. కానీ వారికి రేషన్‌ సరుకులు కాదు కదా.. కనీసం చంద్రన్న కానుకలు కూడా ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు