బార్నార్డ్‌ బీపై ఏలియన్స్‌!

21 Jan, 2019 08:34 IST|Sakshi

న్యూయార్క్‌: మన సౌర కుటుంబం బయట ఉన్న సూపర్‌ ఎర్త్‌పై జీవం ఉండొచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మనకు అతి దగ్గరగా ఉన్న రెండో నక్షత్ర వ్యవస్థ బార్నార్డ్‌లో ఈ గ్రహం ఉంది. దీని పేరు బార్నార్డ్‌ బీ (లేదా జీజే 699 బీ). ఇది భూమికి కనీసం 3.2 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ 233 రోజులకోసారి భ్రమణం పూర్తి చేస్తోంది. ఈ గ్రహంపై –170 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని భావిస్తున్నారు.

అయితే జియోథర్మల్‌ యాక్టివిటీ కారణంగా ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని విలనోవా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అంటార్కిటికాలో కనిపించిన భూగర్భ సరస్సులలోలాగే ఈ గ్రహంపై జరిగే జియోథర్మల్‌ ఉష్ణం కారణంగా ఉపరితలం కింద జీవం ఉండొచ్చని ఈ యూనివర్సిటీలోని ఆస్ట్రోఫిజిసిస్ట్‌ ఎడ్వర్డ్‌ గినన్‌ చెప్పారు. గురు గ్రహ చంద్రుడు యురోపాపై కూడా బార్నార్డ్‌ బీలాంటి ఉష్ణోగ్రతలే ఉన్నాయని గినన్‌ తెలిపారు. అమెరికన్‌ ఆస్ట్రోనామీ సొసైటీ 233వ సమావేశం సందర్భంగా తమ అధ్యయన ఫలితాలను వెల్లడించారు.  

మరిన్ని వార్తలు