ఇల్లు కాదు పాముల పుట్ట, సామాను సర్దేలోగా.. సంతోషం ఆవిరి

15 May, 2023 16:58 IST|Sakshi

అమెరికాలో ఆ ఇంటినిండా పాములే

పాపం.. పొదుపంతా చేసి ఇల్లు కొంటే పాముల పాలు

ఓ సింగిల్ మదర్ విషాద గాథ

ఒకటి కాదు, రెండు కాదు.. పదేళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కొంది ఓ మహిళ. తన కలల సౌధం ఎలా ఉండాలన్నదానిపై అన్ని జాగ్రత్తలు చెప్పింది. తీరా ఇంట్లోకి వెళ్లిన తర్వాత సీన్‌ రివర్సయింది. 

అమెరికాలోని కొలరాడోలో ఉండే ఓ మహిళ పేరు అంబర్‌ హాల్‌. ఆమెకు ఇద్దరు పిల్లలు. సింగిల్‌ మదర్‌ కావడంతో ఖర్చులన్నీ తగ్గించుకుని ఇంటి కోసం ప్రయత్నించింది. నాలుగు బెడ్‌ రూంలు, ఓ చిన్న లాన్‌, అవసరాలకు సరిపడా కాసింత చోటు.. వీటి కోసం గాలించగా.. చివరికి ఓ ఇల్లు దొరికింది. ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన డబ్బంతా కట్టి నాలుగు రోజుల కింద లగేజీ తీసుకుని వచ్చింది. తన వెంట రెండు లాబ్రాడార్‌ కుక్కలు కూడా ఉన్నాయి.

                              

ఇంకా ఫర్నీచర్‌ కూడా సెట్‌ చేయలేదు. అంతలోనే కుక్కలు మొరగడంతో అనుమానం వచ్చింది అంబర్‌ హాల్‌కు. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. ఓ పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే మరికొన్ని పాములు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ గోడ తవ్వినా పామే. ఏ మూల చూసినా పామే. చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని.

                                

కొంత ధైర్యం చేసి స్నేక్‌ క్యాచర్లను పిలవగా ఇప్పటివరకు దాదాపు 40 పాములను పట్టుకెళ్లారు. ఇంకో చోటికి వెళదామంటే ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే ఎన్ని కష్టాలు ఎదురయినా అదే ఇంట్లో ఉంటోంది అంబర్‌ హాల్‌. 

ఇప్పటికీ రోజూ ఏదో ఓ చోట పాము కనబడుతూనే ఉంది. ఇంట్లో రోజూ పాములను పట్టడం దగ్గరున్న అడవిలో వదిలేయడం జరుగుతోంది. ఈ ఇంటికి సమీపంలో ఒకప్పుడు చిన్నపాటి మడుగు ఉండేదట. అక్కడ బోలెడు పాములుండేవట. బహుశా అవే పాములు ఈ ఇంటికి వరుస కట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

                                   

తన దీనస్థితిని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని అంబర్‌ హాల్‌ కోరుతున్నారు. కనీసం ఆ మడుగుపై కాంక్రీట్‌ స్లాబ్‌ వేయగలిగితే పాముల బెడద తప్పుతుందన్నది అంబర్‌ ఆశ. 

మరిన్ని వార్తలు