రంపచోడవరం: పోలవరం.....

19 May, 2023 06:08 IST|Sakshi
మాట్లాడుతున్న పోలవరం పరిపాలనఅధికారి ప్రవీణ్‌ ఆదిత్య

రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి సీవీ ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు బాధితుల సమస్యలపై ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ముంపు బాధితులకు కేటాయించిన భూమి అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, వివిధ రకాల వ్యాపారాలకు అవసరమైన సహకారంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ ఆదిత్య మాట్లాడుతూ రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురై ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో ఉంటున్న 5,800 గిరిజన కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురైన బాధిత గిరిజనులకు భూమికి భూమి ఇస్తామని చెప్పారు. వాటిలో రైతులు నచ్చిన పంటలు వేసుకునేలా సహకారం అందిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భూమి అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో ఉన్నవారికి ఉపాధి పనులు కల్పించేలా చర్రయలు తీసకుంటామని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో నివాసముంటున్న గిరిజన రైతులకు సాగునీరు ఉన్నది లేనిది సర్వ చేసి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాల వివరాలతో యాక్షన్‌ ప్లాన్‌ సమర్పించాలని సూచించారు. ముంపునకు గురైన ఐదు వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురైన 100 కుటుంబాలకు ఒక అధికారిని సర్వేకు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా యువతీ యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు