పార్వతమ్మ అంటే అమ్మంత అభిమానం

25 Feb, 2023 08:54 IST|Sakshi

సీపీఎం పొలిట్‌ బ్యూరో బీవీ రాఘవులు

అంతిమ యాత్రలో పాల్గొన్న జనం

అచ్యుతాపురం(అనకాపల్లి): కమ్యూనిస్టు నాయకురాలు పార్వతమ్మ మరణం తనను తీవ్రంగా బాధించిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి రాఘవులు అన్నారు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో శుక్రవారం కామ్రేడ్‌ పార్వతమ్మ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి రాఘవులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మందికి ఉద్యమంలో శిక్షణ ఇచ్చినామె ఇక లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఉద్వేగానికి గురయ్యారు. జాతీయ, రాష్ట్రీయ నాయకురాలు పార్వతమ్మ వద్దకు వచ్చి అనేక అంశాలపై స్ఫూర్తి పొందేవారని పేర్కొన్నారు.

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ పార్వతమ్మ మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటుగా అభివర్ణించారు. తన భర్త బాటలోనే ఉద్యమాల్లో పాల్గొన్నారని, తన పిల్లలకు సైతం కమ్యూనిస్టు భావాలను కలిగించారని తెలిపారు. గ్రామాభివృద్ధితోపాటు ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. సీపీఎం మండల కార్యదర్శి రొంగలి రాము అధ్యక్షతన సంతాప సభ జరిగింది. అనంతరం తిమ్మరాజుపేట శ్మశాన వాటిక వరకు భారీ జనసమూహం మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. సీఐటీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్‌రావు, శ్రీనివాస్‌, వి. కుమార్‌, గనిసెట్టి సత్యనారాయణ, ఆళ్ల మహేశ్వరరావు, బి. పద్మ, సుమిత్ర, కోన బుజ్జి, బి. రాందాస్‌, కర్రి ఆదిబాబు, నాగమణి, గుర్రం రమణ, రామ్‌కుమార్‌, ఆత్మారాం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు