విజయవాడ ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు 15 పీజీ సీట్లు

8 Mar, 2023 03:52 IST|Sakshi

ఐదు విభాగాల్లో కొత్తగా మంజూరు 

ఇప్పటికే మూడు విభాగాల్లో 9 సీట్లు  

దశాబ్దం తర్వాత మళ్లీ పీజీ సీట్లు వచ్చిన వైనం 

హర్షం వ్యక్తం చేస్తున్న దంత వైద్యులు 

లబ్బీపేట (విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభు­త్వ దంతవైద్య కళాశాలకు ఐదు విభాగాల్లో 15 పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) సీట్లు మంజూరయ్యాయి. దశాబ్దం కిందట మూడు విభాగాల్లో తొమ్మిది పీజీ సీట్లు రాగా, తాజాగా డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఐదు విభాగాల్లో 15 సీట్లు మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన సీట్లుకు 2023–24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దంత వైద్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోసం ఇతర రాష్ట్రాలకువెళ్లకుండా ఇక్కడే అందుబాటులోకి వచ్చినట్లయింది.

కొత్తగా మంజూరైన పీజీ సీట్లు మెరిట్‌ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని దంత వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రెండు (విజయవాడ, కడప) ప్రభు­త్వ దంతవైద్య కళాశాలలున్నాయి. దంత వైద్యంలో పీజీ చేసేందుకు ఇక్కడ సీట్లు అందుబాటులో ఉండేవి కా­దు. దీంతో రాష్ట్రంలోని ప్రైవేటు దంతవైద్య కళాశాలల్లో చేరాల్సి వచ్చేది.

లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లా­ల్సి వచ్చేది. ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో ఇప్పటికే ఉన్న తొమ్మిది పీజీ సీట్లుకు అదనంగా మరో 15 సీట్లు మంజూరు కావడంతో ఏటా 24 మంది పీజీ చదివే అవకాశం లభించింది. అంతేగాకుండా రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి.  

సౌకర్యాల కల్పనతో.. 
ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు రోజూ 250 నుంచి 300 మంది వరకు రోగులు చికిత్సకు వస్తుంటారు.  వా­రి­కి నాణ్యమైన దంతవైద్య సేవలు అందించేందుకు ప్రభు­త్వం సౌకర్యాలు కల్పించింది. కొత్తగా డెంటల్‌ చైర్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు, అత్యాధునిక పరికరాల­ను సమకూర్చారు.

అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తనిఖీలు చేసిన డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బృందం ఇక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ బృందం నివేదిక ఆధారంగా ఐదు విభాగాల్లో 15 పీజీ సీట్లు మంజూరు చేస్తూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతిస్తూ డీసీఐ ఉత్తర్వులు జారీచేసింది.  

మరిన్ని వార్తలు