ఎలుక కష్టం ఎవరికి ఎరుక.. కొరికితేనే బతికేది!

11 Mar, 2023 03:23 IST|Sakshi

రోజూ 0.4 మి.మి. పెరిగే చిట్టెలుకల కోర పళ్లు 

ఏదో ఒకటి కొరుకుతూ అరగదీయకుంటే.. పెరిగి ప్రాణాలకే ముప్పు

అందుకే అన్నీ కొరుకుతూ ప్రతిచోటా విధ్వంసం

ఏడాదికి తినేది 10 కిలోలు.. నష్టపరిచేది 100 కేజీలు

మూషికాలతో దేశంలో 25 శాతం పంట నష్టం

సాక్షి, అమరావతి: ఎలుకలు సృష్టించే విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. కనిపించిన ప్రతీదీ కొరికేస్తూ.. బోలెడంత నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఈ విధ్వంసం వెనుక ఓ చిన్నపాటి విషాదమూ ఉంది. చిట్టెలుకల్లో ఉండే రెండు కొరుకుడు (ఇన్‌సైజర్స్‌) దంతాలు రోజూ 0.4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయట. దీని వల్ల ఈ కోరపళ్లను అవి ఎప్పటికప్పుడు అరగదీయాల్సిందే! లేదంటే అవి ఎలుకల దవడలను చీల్చుకుని బయటకు రావడంతో ఆహారం తినలేవట. దీంతో తిండిలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందట. అందుకే అవి బతకాలంటే నిరంతరం దేన్నైనా కొరుకుతూ ఉండాలి.

అయితే.. దాని వల్ల జరుగుతున్న నష్టం మాత్రం అపారం. తినటానికి పనికిరాకున్నా బలమైన విద్యుత్‌ తీగలు, ప్లాస్టిక్‌ వస్తువులను సైతం కొరికేస్తాయి. చిట్టెలుకలు తీసుకునే ఆహారం రోజుకు 28 గ్రాములే.. కానీ అవి కలిగించే నష్టం మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఏటా 19 నుంచి 21 బిలియన్‌ డాలర్ల పంట నష్టం జరుగుతున్నట్లు లెక్కగట్టారు.

ఎలుకలు తమ శరీర బరువులో దాదాపు 20 శాతం వరకు ఆహారంగా తీసుకుంటాయని ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్‌ గ్రాంట్‌ సింగిల్టన్‌ తెలిపారు. ఒకేసారి కాకుండా రోజుకు 3–4 సార్లు తింటాయి. ఎలుక ఏడాదిలో 10 కేజీల ఆహారం తీసుకుంటే అది కొరికి నాశనం చేసే పంట తినేదానికి పదిరెట్లు అంటే.. దాదాపు 100 కిలోలు ఉంటుందని అంచనా. 

దేశంలో వరి, గోధుమ పంటలకు ఎలుకలు ఏటా 5 నుంచి 15% నష్టం కలిగిస్తున్నాయి. ఇతర అన్ని పంట లను కలిపితే నష్టం సుమారు 25%వరకు ఉంటుంది. 
ఎలుకల కారణంగా కాలిఫోర్నియాలో 504 మిలియన్‌     డాలర్ల పంట నష్టం జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌–నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ రీసెర్చ్‌ సెం    టర్‌ అంచనా వేసింది.  
    ప్రపంచవ్యాప్తంగా 84 రకాల ఎలుకలున్నా 18 రకాల మూషికాలు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నట్లు ఒడిశా స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగంతెలిపింది. 
♦ ఒడిశాలోని 4 గ్రామాల్లో ఎలుకలు 3.60 టన్నుల ఆహార ధాన్యాలను నాశనం చేసినట్లు తేలింది. దుకాణాల్లోని గోడల్లో ఎలుకలు దాచిన ఆహార పదార్థాలను వెలికితీయగాఒక్కోచోట 16.64 నుంచి 21.5 కిలోలు గుర్తించారు.
 సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు జీవించే గోధుమ రంగు ఎలుకలు 21 రోజుల్లో 10 నుంచి 14 పిల్లలను పెడుతుంది. ఇవి నాలుగైదు వారాల్లోనే పరిపక్వ దశకు చేరి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఎలుకలు జతకడితే ఏడాదిలో వాటి సంతానం 1,000 దాటిపోతుంది.  


 

మరిన్ని వార్తలు