రైతుల మోముల్లో ‘ధర’హాసం

17 Nov, 2023 06:19 IST|Sakshi

పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను మించి రికార్డు స్థాయి ధరలు

మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యంతో రైతులకు మేలు

వ్యాపారుల మధ్య పెరుగుతున్న పోటీ

వాణిజ్య, ఉద్యాన పంటలకు ఎమ్మెస్పీకి మించి ధరలు

గరిష్టంగా మిరప క్వింటాకు రూ.27,525, మినుము రూ.11,500

వేరుశనగ రూ.7,596 , పత్తి రూ.7,453

సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసు­కుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ము­ఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మె­స్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల పా­టు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏ­ర్పా­టు చేసి ఆదుకుంది.

దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసా­య, వాణిజ్య పంటలను మార్కెట్‌లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొను­గో­లు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసా­య, వాణిజ్య పంటల­కు మ­ద్దతు ధర దక్కింది. నాలుగున్న­రేళ్లలో 6.17 లక్షల మంది రై­తు­­ల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది.

ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభు­త్వం మార్కెట్‌లో జోక్యం చేసు­కోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మా­ర్కె­ట్‌లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్‌ పంట ఉత్ప­త్తులు మా­ర్కెట్‌లోకి వచ్చే వేళ అప­రా­లు, చిరుధా­న్యా­లు, ఉద్యాన, వాణి­­జ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రి­కార్డు స్థాయిలో పలు­­కు­తుండడం శుభపరి­ణా­మన్నారు.

మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర
అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిర­ప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి.

పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్‌లో గరిష్టంగా రూ.7,453 పలుకు­తోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కె­ట్‌లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.

క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు
అపరాలకు మార్కెట్‌లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి.  మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్‌లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్‌లో రూ.10,500 వరకు ధర­లు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధా­న్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్‌లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది.

వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్‌లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్‌లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తా­యి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్‌లో గరిష్టంగా రూ.­4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్‌ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు.

మరిన్ని వార్తలు