లిక్కర్‌ తాగిన ఎలుక..పట్టుకున్న పోలీసులు

8 Nov, 2023 15:11 IST|Sakshi

చింద్వార: పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు. దొంగలు పడడమే కాదు..స్టేషన్‌లో ఉన్న 60 లిక్కర్‌ బాటిళ్లను ఖాళీ చేశారు. ఈ విషయమై పోలీసులు ఓ దొంగను పట్టుకొని బంధించారు. ట్విస్టేంటంటే ఆ దొంగ మనిషి కాదు..ఎలుక. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారలోని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది.

అసలేం జరిగిందంటే పోలీసులు ఓ అక్రమ  మద్యం సరఫరా చేసే వ్యక్తి దగ్గర నుంచి 60 బాటిళ్ల లిక్కర్‌ సీజ్‌ చేశారు. ఈ మందు బాటిళ్లను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అయితే పీఎస్‌లోకి వచ్చిన ఎలుకలు మొత్తం లిక్కర్‌ తాగేశాయని పోలీసులు చెబుతున్నారు. బాటిళ్లు ఖాళీ అయ్యాయన్న బాధ కంటే అక్రమ మద్యం కేసు నిరూపించడం ఇక కష్టమని పోలీసులు ఆవేదన చెందుతున్నారు. 

కేసు వీగిపోయే పరిస్థితులు కల్పించాయన్న కోపంతో లిక్కర్‌ బాటిళ్లు ఖాళీ చేసిన ఎలుకల్లో ఓ ఎలుకను ట్రాప్‌ చేసి  పట్టుకున్న పోలీసులు దానిని బంధించారు. మిగతా ఎలుకలను పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. కేవలం కొత్వాలి పోలీస్‌స్టేషనే కాదని, అక్కడున్న అన్ని ప్రభుత్వ ఆఫీసు  భవనాలకు ఎలుకలు, చెదల బాధ తప్పడం లేదని, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాటిని వదిలించుకోవడం  తమ వల్ల కావడం లేదని ఓ అధికారి వాపోయారు. 

మరిన్ని వార్తలు