జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: 3 సంవత్సరాలు.. 32 పథకాలు

21 May, 2022 17:14 IST|Sakshi

వివిధ వర్గాలకు చెందిన లక్షలాది మంది లబ్ధిదారులకు సంతృప్తస్థాయిలో పథకాల అమలు...అర్హత వుంటే చాలు కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా పథకాల వర్తింపు.. ఒక్కో ఇంట్లో ఒకటికంటే ఎక్కువ పథకాల లబ్ధిదార్లు.అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామవార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యకేంద్రాల నిర్మాణం...అన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ నిర్మాణమవుతున్న మహా ప్రాజెక్ట్‌ పోలవరం.. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా ఎక్కడా ఆగకుండా కొనసాగిన సంక్షేమ పథకాల అమలు..ఇలా ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలతో... ఈ మూడేళ్లలో వైఎస్ జగన్ పాలన ఆవిష్కృతమైంది.

సమయం సాపేక్షమైంది.. కొంతమందికి ఎంతకూ కదలదు.. మరికొంతమందికి చకచకా అయిపోతుంది.. అందరికీ ఒకే సమయం... అదే సమయం కొంతమందికి భారంగా వుంటుంది..మరికొంతమందికి అరె ఎంత తొందరగా గడిచిపోయింది అన్నట్టుగా వుంటుంది.. ఏ పనీ లేక ఏదో ఒక విధంగా పొద్దుపుచ్చేవారికి కాలం నెమ్మదిగా వెళ్లినట్టనిపిస్తే నిత్యం పనిలో మునిగి తేలేవారికి టైమ్ చకచకా గడిచిపోతుంది.. ఇది టైమ్‌ రిలేటివిటీ చెప్పడానికి శాస్త్రవేత్తలు చెప్పే పోలిక.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన మొదలై మూడు సంవత్సరాలయిపోయిన సందర్భంగా ఈ పోలిక గుర్తుకు రాకమానదు. కళ్లు మూసి తెరిచేలోగా మూడేళ్లు గడిచిపోయాయి.. 2019 మే 30న మొదలైన జగన్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మూడేళ్లలో ఏం జరిగిందో చూద్దాం.

151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించుకొని  అఖండ ప్రజాదరణ పొందిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. అపారమైన ప్రజాభిమాన సాక్షిగా తన పాలన మొదలుపెట్టిన  సందర్భమిది. మొదటిరోజునే అవ్వాతాతల పింఛన్ల మొత్తం పెంపు ఫైలుపై సంతకం పెట్టిన ఆయన ... అలా తన మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో తొలి అడుగు వేశారు.  

మేనిఫెస్టో అంటే ఒక ప్రణాళిక.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫలానా ఫలానా హామీలను నెరవేర్చడం జరుగుతుందని అధ్యక్షుడు ప్రజలకు ఇచ్చే హామీల పత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...తన పార్టీ మేనిఫెస్టోను చాలా సీరియస్గా తీసుకున్నారు.. అందులో పొందుపరిచిన పథకాలకు , కార్యక్రమాలకు ఒకరూపమిచ్చి ఒక్కటొక్కటిగా ప్రకటించారు...వాటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లబ్దిదారుల ఎంపికకోసం గ్రామవార్డు సచివాలయాల రూపంలో సరికొత్త వ్యవస్థను నూతనంగా ప్రవేశపెట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ఏర్పాటు చేసిన గ్రామవార్డు సచివాలయాలు, వాటికి అనుబంధంగా పని చేసే వేలాది మంది వాలంటీర్ల సాయంతో వైఎస్ జగన్ పథకాలు ప్రజల ముంగిటకు పోవడం మొదలైంది..

వైఎస్ జగన్ పాలన ప్రారంభం కావడానికంటే ముందు ఆరు వందలకు పైగా హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలన 2014 జున్‌ 8న మొదలైంది. అందరూ ఆశించినట్టుగా చంద్రబాబు తన మేనిఫెస్టోను అమల్లోకి తెస్తారనుకుంటే...ఆ ఆశ అడియాసే అయింది.

అసలు అలాంటి పుస్తకమే వున్న విషయాన్ని తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు మరిచిపోయారు. అంతే కాదు ఎంతో పవిత్రంగా భావించాల్సిన మేనిఫెస్టోను తన వెబ్‌ సైటునుంచే లేకుండా చేశారు..దాని ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవంతో ముందుకు నడిపిస్తాడని ఊదరగొట్టినవారుకూడా ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయారు. హామీలను మరిచిపోయిన బాబును నిలదీయకపోగా అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిలదీస్తుంటే తప్పుపట్టారు. మా బాబు బంగారమని మురిసిపోయారు.

ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాదు వదిలేసి అమరావతికి పాలన మార్చారు. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా వుండాల్సిన హైదరాబాదును వదులుకొని ...దాదాపుగా పారిపోయినట్టుగా అమరావతికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అందరూ మరిచిపోయేలా చేయడానికి మరో పన్నాగం పన్నారు. అమరావతి పేరు మీద  అంతర్జాతీయ రాజధాని కడుతున్నామంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం వినియోగించి పలు దేశాలు పర్యటించి చివరాఖరికి రెండు మూడు తాత్కాలిక కట్టడాలు కట్టేశారు.అంతే కాదు బాహుబలి గ్రాఫిక్సుల మాయాజాలం మొదలుపెట్టారు. కట్టేది తక్కువ కనికట్టు ఎక్కువన్నట్టుగా వ్యవహరించారు.ఎల్లోమీడియా మాత్రం అదే గ్రేట్ అన్నట్టుగా ప్రచారం దంచేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో హామీలు నెరవేర్చకుండా, గ్రాఫిక్కులతో పొద్దుపుచ్చుతూ... ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటూ వారికి మంత్రి పదవులు కట్టబెడుతూ.. సకల దుర్వినియోగాలకు పాల్పడుతున్న చంద్రబాబును నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అడుగడుగునా నిలదీశారు. ప్రజాక్షేత్రంలోను, అసెంబ్లీలోను ప్రజాభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పపాదయాత్ర ప్రారంభించారు.

ఇడుపులపాయనుంచి ఇచ్ఛాపురందాకా 3648 కిలోమీటర్ల దూరం కొనసాగిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ పలు వర్గాల ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి కష్ట సుఖాలను సమస్యలను స్వయంగా చూసి తెలుసుకొని అవగాహన పెంచుకున్నారు. ఓర్పుతో నేర్పుతో ప్రతి ఒక్కరినీ పలకరించి వారి మనసులో వున్నది ఏదో తెలుసుకున్నారు. ఏ ఏ పనులు చేస్తే మార్పు సాధ్యమో రాజకీయ సామాజిక ఆర్థిక నిపుణులతో చర్చించారు.. పాదయాత్ర అనుభవాలే పునాదిగా రెండంటే రెండే రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసుకున్నారు.

ఈ విధంగా ప్రజల్లోకి వచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను పాలన చేపట్టిన తర్వాత  వైఎస్ జగన్ ఏనాడూ మరిచిపోలేదు.  తన కళ్ల ముందే వుండేలా ఏర్పాటు చేసుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా దీన్ని అందరికీ గుర్తు చేస్తూ వచ్చారు. పాలన మొదలైన వెంటనే  నవరత్న పథకాల్ని ఒక్కటొక్కటిగా అమల్లోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పని హామీలు కూడా ప్రజల ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఆధారపడే రంగాలు విద్య వైద్య వ్యవసాయరంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రంగాల్లో పలు విశిష్ట పథకాలు ప్రవేశపెట్టారు.

అమ్మ ఒడి , విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, కంటి వెలుగు పథకాలద్వారా విద్యారంగంలో ప్రగతిశీల అడుగులు మొదలయ్యాయి. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి వీలుగా ఇంగ్లీషు మీడియా విద్యాబోధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.

వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. మెరుగైన చికిత్సలకోసం ఆంధ్రప్రదేశ్ పౌరులు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తగా ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీలు కడుతున్నారు.  కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల్ని బలోపేతం చేశారు.

వ్యవసాయరంగంలో అన్నదాతలకు అండగా నిలిచేలా  పంట పెట్టబుడి సాయం అందించడానికిగాను రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినరైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానిక అన్నదాతలకు పలు సేవలను అందిస్తున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురయిన కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి అన్ని వ్యవసాయరంగ ప్రయోజనాలను కల్పిస్తున్నారు. సున్నావడ్డీ పథకం ద్వారా పంట రుణాలు అందిస్తున్నారు. మునుపు ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ నష్టాన్ని ఆ సీజన్‌ ముగిసేలోపు ఇన్ పుట్ సబ్సిడీని అందిస్తున్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ సందర్భంవచ్చినప్పుడల్లా తనది మహిళా సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్నారు. అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నావడ్డీదాకా పలు పథకాల్లో మహిళలకే పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చూస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చి ఇళ్లు కట్టించి లక్షలాది రూపాయల స్థిరాస్తి అందిస్తున్నారు. రాజకీయంగా కూడా అన్ని స్థాయిల్లో మహిళా నేతలకు పదవులు దక్కేలా చూస్తున్నారు. దిశ చట్టాన్ని తయారు చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపడమే కాకుండా, దిశ చట్ట స్ఫూర్తితో రాష్ట్రంలో నెలకొల్పిన పోలీస్‌ స్టేషన్లు, వాహనాలు.. టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేసిన దిశ యాప్‌ మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి.
 
వైఎస్ జగన్ పాలన ప్రారంభమై మూడేళ్లవుతున్న సందర్భమిది. ఈ మూడేళ్లలో రెండు సంవత్సరాలపాటు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడించింది. భారతదేశంతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు అతాలకుతలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు మరవక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసిన అడుగులు సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొండంత అండగా నిలిచాయి.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా పాలన చేపట్టిన వైఎస్ జగన్ తన సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు ఇదే విషయంపై  దిశానిర్దేశం చేశారు. అలా ఆయన దిశానిర్దేశం చేసి మూడేళ్లవుతన్న సమయమిది.అప్పటినుంచీ ఈ మూడేళ్లలో పలు రంగాల్లో పలు పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కరోనా మహమ్మారిలాంటి దుర్భరమైన సవాళ్లు ఎదురైనా సరే అన్నిటిని ఎదుర్కొంటూ ముందడుగు వేశారు జగన్‌ . హామీల అమలు ద్వారా ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీకి గట్టి సమాధానం ఇస్తూ... పాలనలో సరికొత్త అధ్యాయం ఆవిష్కరిస్తున్నారని రాజకీయ సామాజిక విశ్లేషకులు అంటున్నారు.

వైఎస్ జగన్ తన పాలన ప్రారంభం కాగానే....పాదయాత్ర అనుభవాలతో , ప్రజాస్పందన పునాదితో తయారు చేసుకున్న మేనిఫెస్టోను చకచకా అమల్లోకి తెచ్చారు. పారదర్శక విధానాలను, పాలనా సంస్కరణలు రూపొందించి అమల్లోకి తెచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సంఖ్య 129 అయితే వాటిలో 123 హామీలను అమల్లోకి తెచ్చి దాదాపు 95శాతం అమలు చేశారు.ఇది ఒక రికార్డు.

2019 మే 30న వైఎస్ జగన్ పాలన ప్రారంభమైంది... సాధారణంగా ఏ ప్రభుత్వమైనా కుదుట పడడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. అంత సమయం కూడా తీసుకోకుండానే అన్ని అంశాలపైనా పట్టుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేశారు. క్షణం కూడా వృధా చేయకుండా, ప్రతి రోజూ ఒక ప్రణాళిక ప్రకారం ఆయా పథకాలను అమలు చేస్తూ, వాటిని సమీక్షించి బలోపేతం చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో ఒక సంవత్సరంకూడా గడవకముందే ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి వచ్చిపడింది. 2020 మార్చి నెలనుంచి దాదాపు రెండు సంవత్సరాలపాటు ప్రపంచ ప్రజారోగ్య వ్యవస్థ తల్లడిల్లింది..ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్ సమర్థవంతంగా పనిచేసిందని ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు అంటున్నారు.

కరోనా లాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ రథం ఆగలేదు. ఒక పక్క ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూనే మరో పక్క ప్రజలకు ఆయా పథకాలు నేరుగా చేర్చారు.డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చక్కగా అమలు చేస్తున్నారని రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అంటున్నారు.వైఎస్ జగన్ పాలన ప్రారంభమై మూడేళ్లవుతున్న ఈ సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి పని చేశారని సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు అంటున్నారు.

వైఎస్ జగన్ పాలన ప్రారంభమై మూడు సంవత్సరాలు..ఈ మూడేళ్లలో వివిధ రంగాల్లో అనేక మార్పులు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.పారదర్శక పాలన,  ప్రజల ముంగిటకే పాలన, గ్రామస్వరాజ్య సాధన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత కనిపిస్తోంది.స్పందన కార్యక్రమంద్వారా ఎక్కడికక్కడ సమస్యల్ని, ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు.గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు,  రైతు భరోసా కేంద్రాలు..ఇంకా ఇతర కార్యాలయాలు మెరుగైన జీవనానికి ఆలంబనగా నిలుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు