ఈఏపీసెట్‌కు 36వేలకు పైగా దరఖాస్తులు

21 Apr, 2022 04:38 IST|Sakshi

మే 10వ తేదీ వరకు గడువు

‘ఇంటర్‌’ వెయిటేజీపై రాని స్పష్టత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీఈఏపీ సెట్‌–2022కు పది రోజుల్లో 36 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి గడువిచ్చింది.  బుధవారం నాటికి 36,977 మంది ప్రవేశ పరీక్షకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 34,716 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి.

బుధవారం 5,719 మంది రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించగా 5,521 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా, ఏపీ ఈఏపీసెట్‌ అభ్యర్థుల ర్యాంకుల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. 2020 వర కు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ విధానాన్ని అమలు చేశారు. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి సెట్‌లో వచ్చిన మార్కులతో కలిపి ర్యాంకులు ప్రకటించేవారు. కరోనా వల్ల తరగతులు, పరీక్షల నిర్వహణ సరిగ్గా లేకపోవడం తదితర కారణాలతో 2021లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. 

నెలాఖరుకు ఈసెట్‌ నోటిఫికేషన్‌
డిప్లొమో పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్‌ ఎంట్రీగా ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో ప్రవేశించేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ ఈ నెలాఖరున వెలువడనుంది. ఆ తదుపరి వరుసగా ఇతర సెట్ల నోటిఫికేషన్లు కూడా విడుదల కానున్నాయి. 

మరిన్ని వార్తలు