అసైన్డ్‌లో గోల్‌మాల్‌

25 Mar, 2021 04:30 IST|Sakshi

2015లో మంగళగిరి కార్యాలయంలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు 495 

అనంతరం రెగ్యులర్‌ చేసుకున్న కొనుగోలుదారులు

మంగళగిరి: టీడీపీ హయాంలో రాజధాని గ్రామాల్లోని అసైన్డ్, లంక భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు కోకొల్లలు. అత్యధికంగా అసైన్డ్‌ భూములున్న కురగల్లు, కరకట్ట రోడ్డు వెంట ఉన్న కృష్ణాయపాలెంతో పాటు పలు గ్రామాల్లోని లంక భూముల క్రయ విక్రయాలపై నిషేధం ఉంది. రాజధాని ప్రకటనకు ముందే వందలాది ఎకరాలు కొనుగోలు చేసినవారు భూముల రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో కొందరు అధికారుల సహకారంతో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఒక్క 2015 సంవత్సరంలోనే మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అసైన్డ్, లంక భూములకు సంబంధించి 495 పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు జరిగాయి.

అసైన్డ్, లంక భూములపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రిజిస్ట్రార్‌ సస్పెండ్‌ అయ్యారు.  దీంతో ఏడాది పాటు అసైన్డ్, లంక భూముల రిజిస్ట్రేషన్‌ల జోలికి అధికారులు వెళ్లలేదు. ఆ తర్వాత గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పెండింగ్‌ దస్తావేజులను రెగ్యులర్‌ చేయడం ప్రారంభించారు. 2017 సంవత్సరంలో 125కిపైగా పెండింగ్‌ దస్తావేజులను రెగ్యులర్‌ చేసిన అధికారులు 2018, 2019లో 129 పెండింగ్‌ దస్తావేజులను రెగ్యులర్‌ చేశారు. అసైన్డ్, లంక భూముల పెండింగ్‌ రిజిస్ట్రేషన్లతో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. దస్తావేజులను రెగ్యులర్‌ చేయడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. 

కురగల్లులోనే రూ.వంద కోట్ల మేర...
విశాఖపట్నానికి చెందిన మైత్రీ ఇన్‌ఫ్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ తేళ్ళ శ్రీనివాసరావు పేరుతో కురగల్లులో సర్వే నంబర్‌ 538, 316/02, 534లలో 2.46 ఎకరాలను కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబర్‌ 4న పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ 593/2015గా రిజిస్ట్రేషన్‌ చేశారు. అదే దస్తావేజుకు 2019 మార్చి 5వ తేదీన 4420/2019గా రెగ్యులర్‌ నంబర్‌ ఇవ్వడం విశేషం. అలాగే 3534/2015లో పెండింగ్‌ నంబర్‌గా ఉన్న దస్తావేజు 2018లో 14113/18 రెగ్యులర్‌ నంబర్‌గా మారింది. తొలుత పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయడం, అనంతరం రెగ్యులర్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్లు ఇవ్వడం ద్వారా ఒక్క కురగల్లు గ్రామంలోనే రూ.100 కోట్ల మేర గత సర్కారు హయాంలో దళారులు, కొందరు అధికారులు లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి.

ఇలాంటి దస్తావేజులు 250కిపైగా రెగ్యులర్‌ నంబర్లు పొందడంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్న సీఐడీ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు ఇవ్వడం రాజధాని గ్రామాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసైన్డ్, లంక భూములను కొనుగోలు చేసిన టీడీపీ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దళారుల్లో కలవరం మొదలైంది. ఈ విషయమై మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ రాధాకృష్ణను వివరణ కోరగా తాను విధుల్లో చేరి ఆరు నెలలు మాత్రమే అయిందన్నారు. తాను వచ్చిన తర్వాత అలాంటి దస్తావేజులు రాలేదని, తాను రాకముందు అవి జరిగాయని తెలిపారు. అసైన్డ్‌ లంక భూముల రిజిస్ట్రేషన్‌ల విషయాలు తనకేమీ తెలియదన్నారు. 

మరిన్ని వార్తలు