తుది విడతలో 553 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం 

18 Feb, 2021 08:27 IST|Sakshi

10,921 వార్డు స్థానాలు కూడా.. 

21న 2,744 సర్పంచ్‌ పదవులకే ఎన్నికలు.. పోటీలో 7,475 మంది

అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  

సాక్షి, అమరావతి: చివరి విడతగా ఈనెల 21న జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 553 పంచాయతీ సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. తుది విడతలో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాల సంఖ్యతోపాటు మిగిలినచోట్ల ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న వివరాలను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది.

నాలుగో విడతలో మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీకాగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. 553 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండు పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,744 చోట్ల సర్పంచ్‌ స్థానాలకు ఈ నెల 21వ తేదీన చివరి పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మొత్తం 7,475 మంది అభ్యర్ధులు సర్పంచ్‌ పదవులకు పోటీలో ఉన్నారు. చివరి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 33,435 వార్డులున్నాయి. వీటిలో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 22,422 వార్డుల్లో ఈ నెల 21న జరగనున్న ఎన్నికల బరిలో 49,083 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన 92 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.
చదవండి: ప్రభంజనం: వైఎస్సార్‌సీపీ సంబరాలు.. 
పేదలపై భారం మోపలేం..
 

మరిన్ని వార్తలు