చంద్రబాబు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా

22 Sep, 2023 05:36 IST|Sakshi

హైకోర్టు తీర్పు కోసం వేచి చూద్దామన్న ఏసీబీ కోర్టు

శుక్రవారం హైకోర్టు తీర్పివ్వకుంటే తాము తీర్పునిస్తామని స్పష్టీకరణ

శుక్రవారంనాటి కేసుల విచారణ జాబితాలో లేని చంద్రబాబు కేసు

దీంతో ఉదయం 10.30కి తీర్పు వెలువరించాల్సి ఉన్న ఏసీబీ కోర్టు

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున, ఆయన్ని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. వాస్తవానికి గురువారమే తీర్పు ఇవ్వాల్సి ఉంది.

అయితే, సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టేయాలని, రిమాండ్‌ సైతం చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. దీంతో ఏసీబీ కోర్టు తన తీర్పును శుక్రవారానికి వాయి­దా వేసింది. చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తే పోలీసు కస్టడీపై తన నిర్ణయాన్ని వాయిదా వేస్తామని, ఒకవేళ హైకోర్టు తీర్పు వెలువరించకుంటే శుక్రవారం ఉదయం 10.30 గంటలకే తీర్పునిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌ ముగింపు గడువు దగ్గర పడుతున్నందున, ఈరోజే కస్టడీ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయాలని సీఐడీ న్యాయవాదులు పట్టుబట్టా­రు.

చంద్రబాబును ఐదు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోరామని చెప్పారు. న్యాయ­స్థానం మాత్రం చంద్రబాబు పిటిషన్‌ హైకో­ర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసిం­ది. చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇస్తుందని తాము భావించడంలేదని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనిపై న్యాయస్థానం చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరింది.

తీర్పు నేడు ఇవ్వాలా లేక శుక్రవారానికి వాయి­దా వేయాలా అన్నది కోర్టు ఇష్టమని చంద్ర­బాబు తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాల­పాటి శ్రీనివాస్‌ తెలిపారు. అనంతరం న్యాయ­స్థానం స్పందిస్తూ.. శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరిస్తుందేమో చూద్దామని తెలిపింది.ఇదిలా ఉంటే.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించడంలేదు. శుక్రవారం నాటి హైకోర్టు కేసుల విచారణ జాబితాలో చంద్రబాబు కేసు లిస్ట్‌ కాలేదు. దీంతో ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించి తీరాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు