Dhulipalla Narendra: సాక్షులను ప్రభావితం చేస్తున్నారుగా?

8 Jun, 2021 05:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ధూళిపాళ్లపై ఏసీబీ ప్రశ్నలవర్షం

8 గంటల పాటు విచారణ

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు సోమవారం విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒక రోజు ముందు నోటీసు ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్‌ భవన్‌లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించనని చెబుతూ బెయిల్‌ పొందిన ధూళిపాళ్ల.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగం డెయిరీ డైరెక్టర్లతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో కీలకమైన డెయిరీ డైరెక్టర్లతో సమావేశం కావడమంటే.. వారిని ప్రభావితం చేసేందుకేనని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ధూళిపాళ్లను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు డెయిరీ వ్యవహారాల్లో ధూళిపాళ్ల కుటుంబం పాల్పడిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా డెయిరీకి చెందిన 10 ఎకరాలను తన కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేయడం, ఫోర్జరీ పత్రాలతో రూ.153 కోట్లు రుణాలు తీసుకుని దారి మళ్లించడం, ఇటీవల డెయిరీ ఖాతాల నుంచి రూ.50 కోట్లు ట్రస్టుకు మళ్లించడం మొదలైన విషయాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.

ఈ కేసులో అరెస్టయినప్పుడు విచారణలో ధూళిపాళ్ల చెప్పినదానికి, ప్రస్తుత విచారణలో చెబుతున్నదానికి పొంతన లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. నిధులు మళ్లించలేదని ధూళిపాళ్ల మొదట్లో వాదించారు. కాగా ఏసీబీ అధికారులు తాజా విచారణలో ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించడంతో కంగుతిన్నారు. దీంతో ఆ నిధుల మళ్లింపునకు ఏవేవో కారణాలు చెబుతూ తన చర్యను సమర్థించుకునేందుకు విఫలయత్నం చేసినట్టు సమాచారం. కానీ సహకార చట్టం నిబంధనలను ఏసీబీ అధికారులు గట్టిగా ప్రస్తావించడంతో ఆయన చాలాసేపు మౌనం వహించారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు