18 నుంచి  ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు

9 Jan, 2021 04:30 IST|Sakshi

ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే అడ్మిషన్లు 

త్వరలో పరీక్షల షెడ్యూల్‌ 

విద్యాసంస్థలు 70శాతం ఫీజు మాత్రమే వసూలుచేయాలి 

ఎప్పటిలాగే ప్రాక్టికల్స్‌ జరుగుతాయి 

పరీక్ష ఫీజులూ పెంచలేదు 

ఈనెల 11న సీఎం చేతుల మీదుగా జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు  

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, అమరావతి: ఈనెల 18 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్లో జరుపుతామని ఆయన తెలిపారు. అలాగే, త్వరలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఇక జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులను ఈనెల 11న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశామని.. ఈ నెల 7 నుంచే దరఖాస్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయని.. దరఖాస్తుల స్వీకరణకు 17 చివరి తేదీ అని, అదే రోజు అడ్మిషన్లు కూడా పూర్తవుతాయని మంత్రి తెలిపారు. 18 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయన్నారు.  

త్వరలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ 
కాగా, 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏప్రిల్, మేలో జరిగే అవకాశముందని.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్‌ వెల్లడించారు. కరోనా కారణంగా 30 శాతం మేర సిలబస్‌ తగ్గించామన్నారు. సీబీఎస్‌ఈ షెడ్యూల్‌ ప్రకారం పోటీ పరీక్షలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే, 2020–21 విద్యా సంవత్సరం ఈ ఏడాది మే వరకూ కొనసాగుతుందన్నారు.   

యథావిధిగా ప్రాక్టికల్స్‌ 
ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఉండకపోవచ్చునంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక అడ్మిషన్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కరోనా నిబంధనలకనుగుణంగా ఫీజులు వసూలు చేయాలన్నారు. గతేడాది వసూలు చేసిన ఫీజులలో 30 శాతం రాయితీ ఇచ్చి, 70 శాతం మేర ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసినా, కరోనా మార్గదర్శకాలను పాటించకున్నా ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటి గుర్తింపు సైతం రద్దుచేస్తామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. వీటిని బేఖాతరు చేసే కళాశాలల అక్రమాలను తమ దృష్టికి తీసుకురావాలనుకున్న వారు 9391282578 వాట్సాప్‌ నెంబర్‌కు గాని, ourbieap@gmail.com మెయిల్‌కుగాని సమాచారమందిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నెల 5న విజయవాడ గొల్లపూడిలోని నారాయణ కాలేజీలో తనిఖీలు చేశామని.. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు 
ఇంటర్‌ అడ్మిషన్ల సమయంలో పదో తరగతి మార్కుల జాబితా, ఇతర పత్రాలను పరిశీలించి, తిరిగి విద్యార్థులకు ఇచ్చివేయాలని మంత్రి సూచించారు. అలా ఇవ్వని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీని కోరామన్నారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్ష ఫీజులు పెంచడంలేదని.. మొదటి సంవత్సరం పరీక్షకు రూ.500లు, రెండో ఏడాదికి రూ.680లు చెల్లించాలన్నారు. 

11న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు 
ఈ నెల 11న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు చేపట్టనున్నట్లు మంత్రి సురేష్‌ వెల్లడించారు. నెల్లూరులో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయనున్నామన్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు.  గతేడాది కంటే ఈ ఏడాది  ఎక్కువ మంది లబి్ధదారులను ఈ పథకానికి ఎంపిక చేశామన్నారు.   

మరిన్ని వార్తలు