పరిశ్రమలకు నీరు.. ప్రగతి పనులకు జోరు

19 Nov, 2022 10:26 IST|Sakshi

కొప్పర్తికి బ్రహ్మంసాగర్‌ నుంచి 0.6 టీఎంసీల కేటాయింపు

రూ.100.18 కోట్లతో పైపులైన్‌ నిర్మాణం

ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తి

త్వరలో పనులు మొదలు 

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడంతోపాటు వాటికి అవసరమైన మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన సమకూరుస్తోంది. ప్రధానంగా పరిశ్రమలకు నీటిని తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటవుతున్న కొత్త పరిశ్రమలకు జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని సాగునీటి వనరుల నుంచి, తెలుగుగంగ పరి«ధిలోని ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాజెక్టుల నుంచి పరిశ్రమలకు గ్రావిటీ, పైపులైన్ల ద్వారా నీటిని తరలించేప్రక్రియను మరింత వేగవంతం చేసింది.

తాజాగా కొప్పర్తి పారిశ్రామికవాడకు బ్రహ్మంసాగర్‌ నుంచి నీటిని తరలించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ. 100.18 కోట్లతో ప్రత్యేక పైపులైన్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఇప్పటికే సదరు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండరు ప్రక్రియ ముగిసిన అనంతరం పనులు మొదలు కానున్నాయి. 80 సెంటీమీటర్ల విస్తీర్ణంతో మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు 32.4 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్‌ నిర్మిస్తున్నారు. ఈ పైపులైన్‌ ద్వారా 46 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) చొప్పున నీటిని తరలించనున్నారు. 

ఆర్టీపీపీ పైపులైన్‌కు అనుసంధానం 
ప్రస్తుతం బ్రహ్మంసాగర్‌ నుంచి ఆర్టీపీపీకి ప్రభుత్వం పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తోంది. ఇందుకోసం 1.4 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు. 2010 మార్చిలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన పైపులైన్‌ ద్వారా ప్రతిరోజు ఆర్టీపీపీకి నీటిని తరలిస్తున్నారు. మరోవైపు మైలవరం నుంచి ఆర్టీపీపీకి నీటి కేటాయింపులు ఉన్నాయి. 

వైఎస్‌ జగన్‌ పాలనలో తగినంత నీరు 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక గడిచిన మూడేళ్లుగా గండికోటలో పుష్కలంగా నీరు నిల్వ పెట్టడంతో మైలవరానికి సైతం నీరు చేరుతోంది. దీంతో మైలవరం నుంచి 0.4 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఆర్టీపీపీకి తరలించే అవకాశం ఏర్పడింది. బ్రహ్మంసాగర్‌ నుంచి పైపులైన్‌ ద్వారా పూర్తి స్థాయిలో ఆర్టీపీపీకి నీటిని తరలించే పరిస్థితి లేదు. దీంతో ఇదే పైపులైన్‌ ద్వారా మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు మరో కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే కొప్పర్తికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొప్పర్తికి 0.6 టీఎంసీల నీరు మాత్రమే అవసరం కావడంతో ఆర్టీపీపీ పైపులైన్‌ నుంచే నీటిని తీసుకునే వెసలుబాటు ఉంది.

మైదుకూరు నుంచి కేవలం 32.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పర్తికి నీరు తీసుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. దీంతో ఈ పథకానికి మొగ్గుచూపిన ప్రభుత్వం ఆ మేరకు పైపులైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే అగ్రిమెంటు ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టనున్నారు. వీలైనంత త్వరగా పైపులైన్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి కొప్పర్తికి నీటిని అందించనున్నారు. నీటి తరలింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో కొప్పర్తిలో పరిశ్రమల నిర్మాణ పనులు మరింత వేగం అందుకోనున్నాయి. స్థలాల కేటాయింపుతోపాటు తగినంత నీటి సౌకర్యం అందుబాటులో ఉండడంతో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కొప్పర్తిలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  

కొప్పర్తికి నీటి కేటాయింపు ప్రక్రియ వేగవంతం 
కొప్పర్తి పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఇక్కడికి నీటి తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. బ్రహ్మంసాగర్‌ నుంచి 0.6 టీఎంసీల నీటిని కేటాయించారు. బ్రహ్మంసాగర్‌ నుంచి ఆర్టీపీపీకి వెళ్లే పైపులైన్‌ ద్వారా మైదుకూరు నుంచి కొప్పర్తి వరకు కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేసి నీటిని తరలించనున్నాం. రూ. 100.18 కోట్లతో పైపులైన్‌ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాం. త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.     
– వి.విజయరామరాజు, కలెక్టర్, వైఎస్సార్‌ జిల్లా  

నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు  
కొప్పర్తి పారిశ్రామికవాడకు మరిన్ని కొత్త పరిశ్రమలు తరలి రానున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రానున్న కొత్త పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తున్నాం. స్థలాలతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడకు నీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బ్రహ్మంసాగర్‌ నుంచి ఇక్కడికి పైపులైన్‌ ద్వారా 0.6 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం. అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో కొప్పర్తిలో మరిన్ని కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు.   
 – రాజోలి వీరారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ సలహాదారు

మరిన్ని వార్తలు