కరోనా నివారణ చర్యలపై ఆళ్ల నాని సమీక్ష

5 Aug, 2020 15:11 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారని డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో జిల్లా అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలపై ఆధికారులతో మంత్రి చర్చించారు. కోవిడ్‌ హాస్పిటల్‌లో ఏర్పాట్లు, భోజనాలు ఇతర శానిటేషన్‌పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు జిల్లాలో 4500 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా వీలైనన్ని కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు వారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వామే తీసుకుంటుదందని మంత్రి వెల్లడించారు.  

కరోనా రోగులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవున్నారు. నాణ్యత లేకుండా ఆహారాన్ని సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దుతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. దేశంలోనే అత్యధిక శాతం కరోనా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని, అందుకే పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే అన్నారు. కరోనా నివారణకు ఎంత ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, జిల్లాలో ఇప్పటి వరకు 1080 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదనంగా మరో 300 ఆక్సిజన్ బెడ్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. నాన్ కోవిడ్‌ కేర్, కోవిడ్‌ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, 1000 మంది నూతన వైద్య సిబ్బందిని వారం రోజులలోపు తీసుకోనున్నట్లు చెప్పారు. స్టాఫ్ నర్సులు, నర్సులు, ఎఫ్ఎన్ఓలను రిక్రూట్ చేస్తున్నామని తెలిపారు.

కరోనా నివారణలో సీఎం జగన్ సారథ్యంలో ప్రజలు కూడా సహకారాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, దీనిపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. ప్లాస్మా దానం చేయడం వల్ల అపాయంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహకంగా 5 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని, కరోనాను జయించిన ప్రజలు ప్లాస్మా దానం చేసి కరోనా నివారణకు సహకరించాలన్నారు. కరోనాపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని, నెలకు 350 కోట్ల రూపాయలను కరోనా నివారణకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కన్నా డబ్బులు ముఖ్యం కాదన్న సంకల్పంతో సీఎం జగన్‌ ముందుకు వెళుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా