వారు తెలుగువారే.. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు!

28 Dec, 2021 15:52 IST|Sakshi
రెండు రాష్ట్రాలను వేరుచేస్తున్న రోడ్డు

ఇటు ఆంధ్ర.. అటు కర్ణాటక

రెండు రాష్ట్రాలకూ రోడ్డే అడ్డు

ఇరు ప్రాంతాల ప్రజలు కలసికట్టుగా జీవనం

అమరాపురం: వారు తెలుగువారే. అయినా కన్నడ మాట్లాడతారు. కన్నడ మాధ్యమంలో చదువుకుంటారు. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు. అంతేనా.. వివాహ, వ్యాపార సంబంధాలు సైతం కన్నడిగులతోనే. రాష్ట్రాలు వేరైనా ఇరు ప్రాంతాల వారూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఆచార, వ్యవహారాలు కూడా ఒకే విధంగా పాటిస్తున్నారు. ఇదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాల పరిస్థితి. 

మడకశిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. మడకశిర మినహా మిగిలిన అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల్లో ప్రజల మాతృభాష కన్నడ. ఇంటిలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు ఎక్కడైనా సరే కన్నడంలోనే మాట్లాడుతారు. అమరాపురం మండల కేంద్రానికి ఏడు కిలో మీర్ల దూరంలో నిద్రగట్ట పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని హెచ్‌బీఎన్‌ కాలనీ కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. పక్కనే కర్ణాటకలోని లక్కనహళ్లి గ్రామం ఉంది. రాష్ట్రాలు, భాషలు వేరైన ఈ రెండు గ్రామాలకు మధ్యన సరిహద్దుగా రోడ్డు ఉంది. కేవలం మూడు అడుగులే దూరం. రోడ్డుకు ఒకపైపు ఆంధ్రప్రదేశ్‌.. మరొక వైపు కర్ణాటక రాష్ట్రం ఉంటాయి. నిద్రగట్ట పంచాయతీ పరిధిలో నిద్రగట్ట, ఎన్‌.గొల్లహట్టి, యర్రగుంటపల్లి, హెచ్‌బీఎన్‌ కాలనీలు ఉన్నాయి. 

ఈ గ్రామాల్లోని విద్యార్థులు కర్ణాటకలోని లక్కనహళ్లి పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ వాసులే అయినప్పటికీ వీరి మాతృభాష మాత్రం కన్నడే. తెలుగు పాఠశాలల్లో చదివినా.. అక్కడ వారు మాట్లాడేది కన్నడ భాషే. దీంతో హెచ్‌బీఎన్‌కాలనీ, కెంపక్కనహట్టి గ్రామాల్లో రెండు కన్నడ పాఠశాలలు ఉన్నాయి. బెంగళూరు, తుమకూరు, దావణగెర పట్టణాల్లో కూడా మన తెలుగువారు చదువుకుంటున్నారు. శిర, హిరియూరు, తుమకూరు, పావగడ, మధుగిరి, తదితర ప్రాంతాల్లో తమ పిల్లలకు వివాహాలు కుదుర్చుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు, స్థలాలు, పొలాలు సైతం రెండు ప్రాంతాల వారివీ అటు – ఇటు కొనసాగుతున్నాయి.

అన్నదమ్ముల్లా ఉంటాం  
రాష్ట్రాలు వేరైనా గ్రామం వేరైనా ఒకేభాష మాట్లాడుకుంటూ అన్నదమ్ములా కలిసిమెలసి ఉంటున్నాం. మాకు రెండు భాషలు వస్తాయి. తెలుగుతో పాటు కన్నడను అనర్గళంగా మాట్లాడుతాము. నా కూతురు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటిలో చదివించా. పిహెచ్‌డీ చేయించా. మాకు చాలా అనుకూలమైన ప్రాంతం. దీంతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూడడుగులు వేస్తే కర్ణాటక లక్కనహళ్లిలో ఉంటాము. రెండు గ్రామాల్లో ఏ శుభకార్యాలు జరిగినా కలిసిమెలసి జరుపుకుంటాం.  
–రాజన్న, హెచ్‌బీఎన్‌ కాలనీ, అమరాపురం మండలం 

పరస్పర సహకారం 
మాకు రాష్ట్రాలు అనే భేద భావం లేదు. అన్నదమ్ముల్లా కలసి ఉంటాం. ఆంధ్ర ప్రాంత ప్రజలు మా గ్రామాల్లో పని చేయడానికి కూలికి వస్తారు. మేము పని ఉంటే ఆంధ్రాకు వెళతాం. హెచ్‌బీఎన్‌ కాలనీ ప్రజలు తెలుగు, కన్నడ బాగా మాట్లాడుతారు. మాకు తెలుగు రాదు. అయినా అర్థం చేసుకుని కన్నడలో మాట్లాడుతాం.   
–రవికుమార్, లక్కనహళ్లి, కర్ణాటక రాష్ట్రం

సంబంధాలు బలపడుతన్నాయి 
పొరుగునే కర్ణాటక రాష్ట్రం ఉండడంతో తమ సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే జరుపుతున్నాం. పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నాం. పెళ్లిళ్లు ఎక్కువగా కర్ణాటకలోనే చేస్తున్నాం. ఆచార వ్యవహరాలు, భోజనం తదితర అన్నీ ఒక్కటిగానే ఉంటాయి. ఇక్కడ ప్రధాన వంటకం రాగి ముద్ద.  
–నాగన్న, హెచ్‌బీఎన్‌ కాలనీ, అమరాపురం మండలం 

చక్కగా మాట్లాడుతారు 
లక్కనహళ్లిలోని కన్నడ పాఠశాలకు నిద్రగట్ట పంచాయతీ నుంచి అధిక మంది విద్యార్థులు వస్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. నేను కన్నడ బోధిస్తా. మా కన్నడిగుల కంటే తెలుగు ప్రాంత విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు బెంగళూరు, మైసూరు తదితర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు.   
–జయరామ్, కన్నడ టీచర్, లక్కనహళ్లి ఉన్నత పాఠశాల

 

ఏపీలో ఉద్యోగావకాశాలు కల్పించాలి 
నేను ఒకటో తరగతి నుంచి కన్నడ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రస్తుతం సెకెండ్‌ పీయూసీ చేస్తున్నా. మాకు ఆంద్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాలు వచ్చేలా చూడాలి. నా సొంత మండలం అమరాపురం. అయితే చదువు కర్ణాటకలో ఉండడం వలన మాకు నాన్‌లోకల్‌గా గుర్తిస్తారు. మండలాన్ని బేస్‌ చేసుకుని లోకల్‌గా పరిగణించాలి. 
–నయన, విద్యార్థి సెకెండ్‌ పీయూసీ, యర్రగుంటపల్లి, అమరాపురం మండలం. 

రెండు భాషలు నేర్చుకోవచ్చు 
హెచ్‌బీఎన్‌ కాలనీ కన్నడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక్కడ తెలుగు, కన్నడ భాషలు రెండు నేర్చుకోవచ్చు. నాది రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహళ్‌ మండలం. ఆంధ్ర సర్కారు గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు నిర్వహించడం మాలాంటి వారికి ఎంతో ఉపయోగం. 
–సోమశేఖర్, ఉపాధ్యాయుడు, హెచ్‌బీఎన్‌ కాలనీ, కన్నడ పాఠశాల

ఆంధ్రలో పథకాలు బాగున్నాయి 
మా రాష్ట్రంలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు పింఛన్‌ ఇక్కడ రూ.600 ఇస్తారు. అదే హెచ్‌బీఎన్‌ కాలనీ మా ఇంటికి ఆరడుగుల దూరంలో ఉంది. అక్కడ నా స్నేహితురాలు నరసమ్మకు పింఛన్‌ రూ.2250 ఇస్తున్నారు. అంతేకాదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.18,750 ఆర్థికసాయం అందిస్తున్నారు.  
–లక్ష్మక్క, లక్కనహళ్లి కర్ణాటక రాష్ట్రం 

మరిన్ని వార్తలు