కోవిడ్‌ తర్వాత పెట్టుబడులు కళకళ 

25 Sep, 2023 04:37 IST|Sakshi

గత 27 నెలల్లో కొత్తగా రూ.32,697 కోట్ల ఒప్పందాలు 

ఇదే సమయంలో రూ.60,486 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి

ఈ ఏడాది తొలి 3 నెలల్లో రూ.7,187 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు 

13 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడంతో రూ.4,919 కోట్ల పెట్టుబడులు కార్యరూపంలోకి.. డీపీఐఐటీ తాజా గణాంకాల్లో వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్‌ తర్వాత ఏటా పెరుగుతున్న ఒప్పందాలు, వాస్తవ రూపంలోకి వచ్చిన పెట్టుబడులే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్‌ ప్యాకేజీతో పరిశ్రమలను ఆదుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఎంచుకుంటున్నారు.

2021 తర్వాత నుంచి రాష్ట్రం ఆకర్షిస్తున్న పెట్టుబడుల విలువ భారీగా పెరుగుతోంది. 2021లో రూ.9,373 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 47 ఒప్పందాలు కుదరగా 2022లో 54 యూనిట్ల ద్వారా రూ.16,137 కోట్ల విలువైన ఒప్పందాలు జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18 యూనిట్ల ద్వారా రూ.7,187 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అంటే గత 27 నెలల్లో కొత్తగా 119 యూనిట్లను ఆకర్షించడం ద్వారా రూ.32,697 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.

మార్చిలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో 387 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా గరిష్టంగా ఆరు నెలల్లోనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రానున్న త్రైమాసికాల్లో ఈ ఒప్పందాల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఉత్పత్తి ప్రారంభించడంలోనూ అదే జోరు
కేవలం కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. ‘వైఎస్‌ఆర్‌ వన్‌’ ద్వారా ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించే వరకు అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ వ్యవస్థను తెచ్చింది. దీంతో గతేడాది పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

2021లో రూ.10,350 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 47 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ తెలిపింది. 2022లో రూ.45,217 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రూ.4,919 కోట్ల విలువైన 13 యూనిట్లు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. అంటే గత 27 నెలల వ్యవధిలో మొత్తం 106 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.60,486 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 కాలంలో సగటున ఏటా రూ.11,994 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇప్పుడు నాలుగేళ్లుగా ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం గమనార్హం. ఈ ఏడాది ముగిసేనాటికి సగటు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు