పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు

26 Mar, 2023 03:49 IST|Sakshi

జీఐఎస్‌ ఎంఓయూలు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు 

వీటి పర్యవేక్షణకు సీఎస్‌ అధ్యక్షతన ఇప్పటికే మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు 

తాజాగా.. కొత్త పారిశ్రామిక విధానంలో ఎర్లీ బర్డ్‌ పేరిట ప్రత్యేక ప్రోత్సాహకాలు 

సదస్సు జరిగిన నాటి నుంచి ఆరు నెలల్లో పనులు ప్రారంభించే యూనిట్లకు ఇవి వర్తింపు 

10 శాతం స్టాంప్‌డ్యూటీ, ల్యాండ్‌ కన్వర్షన్‌ చార్జీలు తిరిగి చెల్లింపు  

ఇన్‌ఫ్రా వ్యయంలో 50% గరిష్టంగా రూ.కోటి వరకు చెల్లింపు 

సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందా­లు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటిం­చింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) ఒప్పం­దాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్‌ ప్రాజెక్టŠస్‌ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్‌ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. 
 
ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు 
విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్‌ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్‌ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్‌ కన్వర్షన్‌ చార్జీల రీఎంబర్స్‌ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు.

ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. 
 

మరిన్ని వార్తలు