అవినీతిపై సర్కార్‌ ఉక్కుపాదం

5 Aug, 2022 03:23 IST|Sakshi
ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు

14400 టోల్‌ఫ్రీ నంబర్‌కు అందుతున్న ఫిర్యాదులు 

గురువారం మరో 9 పట్టణ స్థానిక సంస్థల్లో ఏసీబీ దాడులు 

రెండు రోజుల దాడుల్లో రూ.2,74,720 నగదు సీజ్‌

సాక్షి, అమరావతి: నగరపాలక, పురపాలక సంస్థల్లో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయాల్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కూడా అనకాపల్లి, బొబ్బిలి, సామర్లకోట, ఏలూరు, మార్కాపురం, తిరుపతి, రాజంపేట, పుట్టపర్తి, నందిగామ మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల్లో పట్టణ ప్రణాళికా విభాగం రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంపై అధికంగా అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఆరోపణలు రుజువైతే అవినీతిపరులపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. దీంతో అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. కాగా ఏసీబీ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి.  

గత కొన్నేళ్లుగా ఆరోపణలు.. 
మున్సిపల్, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని సిబ్బందిపై గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోణలు వస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నా.. ఆస్తి పన్ను అసెస్‌మెంట్‌ చేసేందుకు సర్వే చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తగా భవన నిర్మాణం చేపట్టాలన్నా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉండి, ఇంటి ప్లాన్‌ కూడా నిబంధనల మేరకు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టు పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ (సీడీఎంఏ)కి, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో అవినీతిపరుల ఆటకట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తేవడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలపై అధిక ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ వాటిలో దాడులు ముమ్మరం చేసింది. ఏసీబీ తనిఖీలపై నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక సంస్థలు, 4,132 వార్డు సచివాలయాల్లో ప్రజలకు కనిపించేలా ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్‌ ప్రదర్శించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

పట్టణ ప్రణాళిక విభాగం నిర్లక్ష్యం..
సూళ్లూరుపేటలో రూ.2,00,960, జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి మున్సిపాలిటీలో రూ.38,200, పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయంలో రూ.35,560 అనధికార నగదును ఏసీబీ అధికారులు గత రెండు రోజుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలుచోట్ల సర్వే, ప్లాన్‌ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను కాలవ్యవధికి మించి పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించారు.

అంతేకాకుండా అనధికార నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేల్చారు. అలాగే నిబంధనల ప్రకారం కొన్ని భవనాలకు నిర్మాణాల అనుమతి రుసుం వసూలు చేయడంలో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది విఫలమయ్యారని.. రికార్డులను సైతం సరిగా నిర్వహించడం లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు.   

మరిన్ని వార్తలు