అపరాలు, చిరుధాన్యాలపై గురి

7 Nov, 2022 03:16 IST|Sakshi

వడివడిగా ప్రారంభమైన రబీ సాగు

సాధారణ విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు.. 

గతేడాది రికార్డు స్థాయిలో 57.27 లక్షల ఎకరాల్లో సాగు

ఈ ఏడాది సాగు లక్ష్యం 58.68 లక్షల ఎకరాలు.. ఇప్పటివరకు మూడు లక్షల ఎకరాల్లో సాగు

వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలపై దృష్టి

బోర్ల కింద ఆరుతడి పంటలు..  రైతులకు ప్రోత్సాహకాలు

50% సబ్సిడీపై ఇన్‌పుట్స్‌ సరఫరా

సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది.

సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు.

రూ.25 కోట్లతో కార్యాచరణ
రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్‌లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది.

ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్‌ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్‌లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్‌ మిల్లెట్‌ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్‌లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రైతులకు ప్రోత్సాహకాలు ఇలా..
ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు.

వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్‌ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్‌ ఇంట్రస్ట్‌ గ్రూపులకు (ఎఫ్‌ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది.

బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ

ప్రోత్సాహకాలు ఇలా..
బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు.

వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్‌ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్‌ ఇంట్రస్ట్‌ గ్రూపులకు (ఎఫ్‌ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు