అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఆదర్శం 

15 Sep, 2022 11:42 IST|Sakshi

మూడేళ్లకే 30 ఏళ్ల అభివృద్ధి

అసమానతల తొలగింపే లక్ష్యం

ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలన

విప్‌ కాపు రామచంద్రారెడ్డి

సోమలాపురంలో  మోడల్‌ సచివాలయ ప్రాంగణ ప్రారంభం

డీ హీరేహాళ్‌ (రాయదుర్గం): కళ్లెదుటే సచివాలయం.. పక్కనే రైతు భరోసా కేంద్రం.. చెంతనే నూతన హంగులతో రూపుదిద్దుకున్న సర్కార్‌ బడులు.. మరోవైపు హెల్త్‌ క్లినిక్‌.. నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్‌ లైబ్రరీ.. సమీపంలోనే పాల సేకరణ కేంద్రం.. ఇది సీఎం వైఎస్‌ జగన్‌ మూడేళ్ల క్రితం కన్న కల. దీన్ని సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి రాష్ట్ర వ్యాప్తంగా మహా వృక్షంలా ఎదిగింది. రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్తులను ప్రజలకే అంకితం చేసిన గొప్ప పాలనాదక్షుడు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

అనంతపురం జిల్లా డీ హీరేహాళ్‌ మండలం సోమలాపురంలో మోడల్‌గా ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్‌క్లినిక్‌ ఇతర కార్యాలయాలను ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మతో కలిసి ప్రభుత్వ విప్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సుదర్శనరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విప్‌ కాపు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఒక్క సోమలాపురంలోనే వివిధ పథకాల కింద రూ.8.62 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. అర్హతే ప్రామాణికంగా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికీ రూ.1.50 లక్షలకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1.65 లక్షల కోట్లను జమచేసిన ఏకైక ప్రభుత్వంగా వైఎస్సార్‌సీపీ రికార్డు సృష్టించిందన్నారు. మూడేళ్ల వ్యవధిలోనే 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.41 కోట్లతో 39 గ్రామాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తాగునీరందించబోతున్నామన్నారు. ఇందులో ఒక్క డీ హీరేహాళ్‌ మండలంలోనే 22 గ్రామాలు ఉన్నాయని ప్రకటించారు. 

దోపిడీపైనే కాలవ దృష్టి 
మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజా ధనం దోపిడీ చేయడం తప్ప ప్రజల సంక్షేమం  గురించి ఏనాడూ పట్టించుకోలేదని విప్‌ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. నాడు ‘నీరు– చెట్టు’ పనుల్లో రూ.కోట్లు దోచుకున్నారని, ఇసుక, మట్టిని కొల్లగొట్టారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడేదో ప్రజల కోసం ఉద్ధరిస్తున్నట్లు రాయదుర్గంలో నాటకాలకు తెరలేపారన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో కాలవ శ్రీనివాసులు అనంతపురానికి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి తలదాచుకున్నారని ధ్వజమెత్తారు.  

వికేంద్రీకరణతోనే అభివృద్ధి  
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలూ సమగ్రాభివృద్ధి చెందుతాయని ఎంపీ   రంగయ్య స్పష్టం చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు       రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని టీడీపీ అధినేతపై ధ్వజమెత్తారు. గతంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇది రుచించడం లేదని, అందుకే సంక్షేమ పథకాల తమాషా అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పథకం ఆపాలో ప్రజల్లోకొచ్చి చెప్పే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, ఎంపీపీ పవిత్ర, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాబాను, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్‌నాయక్, వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్‌ వన్నూర్‌స్వామి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, పార్టీ నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు